Site icon NTV Telugu

Minister Nara Lokesh Praja Darbar: రీసర్వేలో గ్రామకంఠంగా పట్టా భూమి.. మంత్రి లోకేష్‌కి ఫిర్యాదు

Lokesh

Lokesh

Minister Nara Lokesh Praja Darbar: కూటమి ప్రభుత్వం ఏర్పడినాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌ కొనసాగిస్తున్నారు.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు.. ఇక, 38వ రోజు “ప్రజాదర్బార్” కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే బారులు తీరారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ ను స్వయంగా కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు అందించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయా సమస్యల పరిష్కారంపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Top OTT Platform : టాలీవుడ్ లో భారీ స్కాం.. ఈ ఓటీటీ క్లోజ్ ?

మంగళగిరి నియోజకవర్గం నుంచి పలు విజ్ఞప్తులు మంత్రి లోకేష్‌కి వచ్చాయి.. గ్రామస్థుల నుంచి రూ.3 కోట్ల వరకు అప్పుగా తీసుకుని పరారైన గొరిజాల శ్రీనివాసరావును అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని పెదవడ్లపూడికి చెందిన మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. గ్రామంలో అనేక మంది వద్ద అప్పులు చేసిన శ్రీనివాసరావు.. వాటిని చెల్లించకుండా తప్పించుకునేందుకు పెదవడ్లపూడిని వదిలి కుటుంబంతో సహా గుంటూరుకు మకాం మార్చారని, ఇప్పుడు బెంగుళూరు పరారయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశీలించి తగిన విధంగా న్యాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. పక్షవాతంతో బాధపడుతున్న తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన అక్కల శివశంకరరావు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇటీవల సంభవించిన వరదలకు తమ ఇళ్లల్లోకి నీరు చేరి సామాగ్రి పూర్తిగా పాడైపోయాయని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మహానాడు ప్రాంత వాసులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందలేదని, విచారించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశీలించి నష్టపరిహారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రోజువారీ కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్న తాను ఇటీవల అనారోగ్యం బారిన పడ్డానని, భర్త కూడా లేని తనకు వితంతు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఆత్మకూరు వడ్డెరపాలెంకు చెందిన వేముల సీతమ్మ కోరారు.

Read Also: Top OTT Platform : టాలీవుడ్ లో భారీ స్కాం.. ఈ ఓటీటీ క్లోజ్ ?

ఇక, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తే.. పట్టా భూమిని రీసర్వేలో గ్రామకంఠంగా నమోదు చేశారని మంత్రి లోకేష్‌ దృష్టికి తీసుకొచ్చారు బాధితులు.. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కునింపూడిలో తన తండ్రికి చెందిన 1.95 ఎకరాలను ఫోర్జరీ డాక్యుమెంట్లతో గల్లా నాగవెంకట సత్యనారాయణ కబ్జా చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని ఏలూర జిల్లా కోడేలుకు చెందిన ఆదినాగు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురంలో తమ కుటుంబానికి చెందిన 1.09 ఎకరాల పట్టాభూమిని గత వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన రీసర్వేలో గ్రామకంఠంగా నమోదు చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని మార్కాపురానికి చెందిన రాచకొండ లక్ష్మీదేవి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నామని, వెబ్ ల్యాండ్ నుంచి తొలగించిన తమ భూమిని పునరుద్ధరించి క్రయవిక్రయాలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు ఇలా పలు సమస్యలను విన్న లోకేష్‌.. ఆదుకుంటానని బాధితులకు హామీ ఇచ్చారు..

Exit mobile version