Nara Lokesh: అనంతపురంలో ఇవాళ జరగనున్న సూపర్ సిక్స్- సూపర్ హిట్ బహిరంగ సభకు ఏపీ మంత్రి నారా లోకేష్ దూరంగా ఉంటున్నారు. నేపాల్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ఆయన దృష్టి పెట్టారు. ఇందుకోసం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ మేరకు ఆర్టీజీఎస్ సెంటర్ లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సప్ నెంబర్ ఏర్పాటు చేసి సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో సమన్వయం చేయనున్నారు. అధికారులు తక్షణమే ఆర్టీజీఎస్ కేంద్రానికి రావాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలుగువారి వివరాలు సేకరించి తక్షణమే వారిని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడంపై నారా లోకేష్ కార్యాచరణ ప్రారంభించనున్నారు.
Read Also: Taapsee Pannu : బక్కచిక్కిపోయిన తాప్సీ లుక్ వైరల్ – హెల్త్‌పై ఫ్యాన్స్ టెన్షన్
అయితే, నేపాల్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 187 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా నేపాల్ లోని నాలుగు ప్రాంతాల్లో ఉన్నారు. బఫాల్ లో చిక్కుకున్న 27 మంది శ్రీధరాచార్యుల పర్యవేక్షణలో ఉండగా.. సిమిల్ కోట్ లో కారి అప్పారావు దగ్గర 12 మంది, పశుపతి నగరంలోని మహదేవ్ హోటల్ వద్ద విజయ పర్యవేక్షణలో 55 మంది, గౌశాలలోని పింగలస్థాన్ లో 90 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. నేపాల్ లోని భారత రాయబారి నవీన్ శ్రీ వాస్తవకు పరిస్థితిని వివరించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది. తెలుగు ప్రజల భద్రతే ప్రాధాన్యంగా మంత్రి నారా లోకేష్ కేంద్ర ఏజెన్సీలు, భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు.
