iTDP and YSRCP: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లొద్దు.. ఐటీడీపీ, వైసీపీ కీలక ప్రకటనలు!

Itdp And Ysrcp

Itdp And Ysrcp

iTDP and YSRCP: ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఐటీడీపీ, వైఎస్సార్‌సీపీ పార్టీలు కీలక ప్రకటనలు విడుదల చేశాయి. వ్యక్తిగత విషయాలపై బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని ఇరు పార్టీలు తమ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులకు సూచించాయి. రాజకీయ విమర్శలు, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన చర్చల మధ్య స్పష్టమైన హద్దులు పాటించాలని పిలుపునిచ్చాయి. అంతే కాదు.. ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవంటూ వార్నింగ్‌ కూడా వచ్చేసింది..

ఐటీడీపీ హెచ్చరిక.. అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్రమశిక్షణా చర్యలు!
కూటమి పార్టీల నాయకులతో పాటు వైఎస్సార్‌సీపీ నేతల వ్యక్తిగత జీవితాలపై ఎవరైనా వ్యాఖ్యలు చేయడం, చర్చలు జరపడం ఆమోదయోగ్యం కాదని ఐటీడీపీ తన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఐటీడీపీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఎవరైనా వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తమ దృష్టికి వస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎవరైనా వ్యక్తిగతంగా వెల్లడించే అభిప్రాయాలకు, ఇతరులు చేసే అవమానకర వ్యాఖ్యలకు ఐటీడీపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది.

వైసీపీ అధికారిక ప్రకటన.. పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచనలు
మరోవైపు వైఎస్సార్‌సీపీ కూడా ఇదే అంశంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీ నాయకులు, అధికార ప్రతినిధులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులకు పలు సూచనలు చేసింది. రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వ్యాఖ్యలు, చర్చలు వివిధ సోషల్ మీడియా వేదికల్లో కనిపిస్తున్నాయని పేర్కొంది. ఇవి పూర్తిగా వ్యక్తిగత విషయాలకు సంబంధించినవి కావడంతో సంబంధిత వ్యక్తుల గోప్యతను గౌరవించాలని సూచించింది. బహిరంగ వేదికల్లో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని కోరింది.

వైసీపీ నాలుగు కీలక సూచనలు
* బహిరంగ వ్యాఖ్యలు వద్దు: వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు లేదా ప్రకటనలు చేయకూడదు.
* సోషల్ మీడియా చర్చలకు దూరంగా ఉండాలి: వ్యక్తిగత అంశాలకు సంబంధించిన పోస్టులపై చర్చలు చేయడం, వాటికి స్పందించడం మానుకోవాలి.
* కంటెంట్‌ను షేర్ చేయకూడదు: వ్యక్తిగత విషయాలకు సంబంధించిన సమాచారాన్ని, పోస్టులను ఇతరులకు షేర్ చేయడం లేదా ప్రచారం చేయడం చేయకూడదు.
* బాధ్యతాయుతమైన వ్యవహారం: అన్ని బహిరంగ సంభాషణల్లో గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన వైఖరిని కొనసాగించాలి. ఈ నాలుగు సూచనలను పార్టీకి సంబంధించిన వారంతా తప్పనిసరిగా పాటించాలని వైఎస్సార్‌సీపీ కోరింది.

రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు చెక్ పడినట్టేనా..?
ఒకవైపు ఐటీడీపీ కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా, మరోవైపు వైఎస్సార్‌సీపీ తమ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసే క్రమంలో వారి వ్యక్తిగత జీవితాలను ప్రస్తావించకుండా ఉండాలన్న సందేశాన్ని ఇరు పార్టీల ప్రకటనలు ఇచ్చాయి. ఈ పరిణామంతో ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికలపై వ్యక్తిగత విమర్శలు, అనుచిత పోస్టుల విషయంలో పార్టీల వైఖరి చర్చనీయాంశంగా మారింది.. గతంలో నేతలు ప్రత్యక్షంగా.. పరోక్షంగా వ్యక్తిగత జీవితాలు ప్రస్తావించిన ఘటనలు ఏపీ రాజకీయాల్లో కోకొల్లలు.. ఇక, సోషల్‌ మీడియా పోస్టులకు అంతేలేదు అన్నట్టుగా సాగిపోయింది.. ఈ తరుణంగా రెండు పార్టీలు ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది..