Free Gas Cylinders: ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు రెడీ అయింది. మహిళలకు దీపం పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నవంబర్ 1న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక ప్రీ గ్యాస్ సిలిండర్ కోసం బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. రోజు వారీ కంటే మూడు రెట్లు ఎక్కువ మంది ఆన్ లైన్‌లో బుక్ చేసుకుంటున్నారు. కొందరు గ్యాస్ కనెక్షన్ బుక్ తో పాటు తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని గ్యాస్ కంపెనీల దగ్గర బుకింగ్ చేసుకునేందుకు క్యూ కట్టారు.
Read Also: Bomb Threat: మూడు విమానాలకు బెదిరింపు కాల్.. సీఐఎస్‌ఎఫ్ అప్రమత్తం
మొదట 833 రూపాయలు డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లోపు కస్టమర్ల ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. రేపు దీపావళి పండుగ రోజు నుంచి ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ చేయనున్నారు. ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఏపీ సర్కార్ ఇవ్వనుంది. దీంతో.. ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్లకు బుకింగ్‌లు జోరుగా జరుగుతున్నాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి గ్యాస్ కనెక్షన్‌తో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డును ప్రాతిపదికగా నిర్ణయించారు. పథకంలో భాగంగా వినియోగదారులు తొలుత సిలిండర్ కోసం నగదు చెల్లించాల్సి ఉంటుంది. అయితే గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన రెండు రోజులలోపే వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ మొత్తం జమచేస్తారు. డీబీటీ ద్వారా ప్రభుత్వం నిధులు జమ చేయనుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు ఏడాదికి 2,684 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
అయితే, మొదటి సిలిండర్ పంపిణీ కోసం ఇంధన సంస్థల వద్ద సబ్సిడీ మొత్తాన్ని అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో నిధుల విడుదలకు ఉత్తర్వులు ఇచ్చారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా డిసెంబరు నుంచి మార్చి నెలాఖరు వరకూ తొలి సిలిండర్ అందిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి జులై వరకు రెండో సిలిండర్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక మూడో ఉచిత సిలిండర్‌ను ఆగస్టు నుంచి నవంబరులోగా తీసుకునేందుకు అవకాశం ఉంది. రాష్ట్రంలోని 1.47 కోట్ల తెల్ల రేషన్ కార్డు దారులు ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకునేందుకు అర్హులు. అలాగే ఉచిత గ్యాస్ కోసం బుకింగ్ చేస్తే గ్రామాల్లో 48 గంటల్లో, పట్టణాల్లో 24 గంటల్లో సరఫరా చేస్తారు. పథకం అమల్లో ఏమైనా సమస్యలు ఉంటే 1967కు ఫోన్ చేసి, పరిష్కరించుకోవచ్చు.