Amaravati Avakaya Utsav: విజయవాడలోని పున్నమి ఘాట్‌లో రెండో రోజు ఆవకాయ అమరావతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. సినిమా, సంస్కృతి, సాహిత్యాల సమ్మేళనంగా కొనసాగిన ఈ ఉత్సవాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కృష్ణానది తీరంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవ వాతావరణాన్ని మరింత సొగసుగా మార్చాయి. సంగీతం, నృత్య ప్రదర్శనలతో పాటు సినీ సాహిత్యంపై జరిగిన చర్చలు మంచి స్పందన పొందాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు పున్నమి ఘాట్‌ను కళా, సాంస్కృతిక వేదికగా నిలిపాయి. ఈ కార్యక్రమాలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీకళ తదితరులు హాజరై కళాకారులను అభినందించారు.
Read Also: India Slams Mamdani: ‘‘మీ పని చూసుకోండి’’.. న్యూయార్క్ మేయర్ మమ్దానీపై భారత్ విమర్శలు..
కాగా, రాష్ట్ర సంస్కృతి, వంటకాలు, సృజనాత్మక రంగాలను ప్రోత్సహించేలా ఈ ఫెస్టివల్‌లో 28 ప్రత్యేక ఈవెంట్లు, 4 వర్క్‌షాప్‌లు నిర్వహించారు.. ప్రపంచంలో ఫుడ్ అంటే భారతదేశం.. భారతదేశంలో ఫుడ్ అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వచ్చే స్థాయికి మన వంటకాలకు ఖ్యాతి ఉంది అంటూ ఆంధ్ర వంటల గొప్పదనాన్ని సీఎం చంద్రబాబు.. ఈ ఉత్సవాల ఆరంభంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఉత్సవాలు, సంబరాలు లేక ప్రజల్లో నవ్వులు కూడా కరువయ్యాయని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడలో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్, అమ్మవారి దసరా ఉత్సవాలను ప్రపంచస్థాయిలో నిలబెట్టామని చంద్రబాబు గుర్తుచేశారు. ఒకప్పుడు దసరా అంటే మైసూరు, కలకత్తా గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు దసరా అంటే విజయవాడ గుర్తుకు వచ్చేలా ఉత్సవాలు నిర్వహించాం అని చెప్పారు. ఇక, తెలుగు సినీ చరిత్ర గురించి ప్రస్తావించిన సీఎం చంద్రబాబు.. భక్త ప్రహ్లాద నుంచి బాహుబలి వరకు తెలుగు చిత్రసీమ ఎన్నో ప్రయోగాలు చేసింది. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, శోభన్‌బాబు వంటి మహానటులు కృష్ణాజిల్లా నుంచే వచ్చి సినిమా రంగానికి దిక్సూచిగా నిలిచారు.. పవన్ కల్యాణ్, బాలకృష్ణ వంటి వారు తెలుగు సినిమాను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తున్నారు అని కొనియాడారు. కృష్ణాజిల్లా సంపద సృష్టిలో, వ్యాపార చొరవలో ఎప్పుడూ ముందే ఉంటుందని సీఎం ప్రత్యేకంగా ప్రశంసించిన విషయం విదితమే..
