Site icon NTV Telugu

LPG Supply: గ్యాస్‌ ఆన్‌లైన్‌ బుకింగ్ మాత్రమే జరగాలి.. బ్లాక్ మార్కెటింగ్‌కి చోటు లేదు..

Payyavula Keshav

Payyavula Keshav

LPG Supply: గ్యాస్ సిలిండర్ల బుకింగ్ తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారానే జరగాలని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. గ్యాస్ సరఫరాలో ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్‌కు అవకాశం లేదని, అలాంటి చర్యలకు పాల్పడితే కంపెనీలు మరియు ప్రభుత్వం కలిసి కఠిన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. భారతదేశంలోని రిఫైనరీలకు గ్యాస్ ఉత్పత్తి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశంలో వినియోగిస్తున్న గ్యాస్‌లో సుమారు 10 నుంచి 20 శాతం వరకు భారత రిఫైనరీల నుంచే ఉత్పత్తి అవుతోందని చెప్పారు.

ఇక, గ్యాస్ సరఫరాలో ముఖ్యంగా ఆసుపత్రులు మరియు గృహ వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు పయ్యావుల.. వినియోగదారులు ఎంతమంది బుకింగ్ చేసినా అర్బన్ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్న వారికి 32 రోజుల క్యాప్ విధించామని తెలిపారు. కోవిడ్ సమయంలో ఎదుర్కొన్న కష్టాల్లాగే ప్రస్తుతం గ్యాస్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అయితే ఆసుపత్రులు, హాస్టళ్లు వంటి కీలక ప్రాంతాల్లో ఎక్కడా ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మరోవైపు, హోటల్ అసోసియేషన్‌లతో ఇప్పటికే సమావేశమయ్యామని, అన్ని అసోసియేషన్‌లతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. కొన్ని హోటల్ అసోసియేషన్‌లు బొగ్గుతో నడిచే తందూరి బట్టీలపై వంటలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించాయని మంత్రి పేర్కొన్నారు. పైపుల ద్వారా గ్యాస్ కనెక్షన్లు ప్రస్తుతం మంచి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయని, ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే నేచురల్ గ్యాస్ కంపెనీలతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక, సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్‌టీజీఎస్ ద్వారా అన్ని టీమ్‌లతో సమావేశమై పరిస్థితిని సమీక్షించనున్నట్లు తెలిపారు. గ్యాస్ బుకింగ్ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే జరగాలని, ప్రస్తుతం 88 శాతం వినియోగదారులు ఓటీపీ ద్వారా సిలిండర్ తీసుకునే స్థితికి వచ్చారని మంత్రి తెలిపారు. మారుతున్న పరిస్థితుల్లో ప్రజలు కష్టనష్టాలను తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. గ్యాస్ ధరలు పెరగకుండా ప్రభుత్వం దృష్టి పెడుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని, అధిక ధరలు వసూలు చేసే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాన ఆలయాల్లో ఇప్పటికే స్టీమ్ మరియు సోలార్ కుకింగ్ విధానాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి పయ్యావుల కేశవ్..

Exit mobile version