CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.. దేశంలోని ప్రముఖ ఆర్థిక దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును సీఎం చంద్రబాబుకు ప్రకటించింది. రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాలు అమలు చేయడం, పారిశ్రామిక సంస్కరణలు చేపట్టడం, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంలో విశేష కృషి చేసినందుకుగానూ ఈ అవార్డును ఎంపిక చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. మార్చి నెలలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డును సీఎం చంద్రబాబు స్వీకరించనున్నారు. ఈ ఎంపిక దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ ద్వారా ఎంపిక చేస్తారు..
Read Also: Yellamma : హీరోగా దేవిశ్రీ ప్రసాద్.. అనౌన్స్ మెంట్ రాబోతుంది
ఈ జ్యూరీలో భర్తీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు డాక్టర్ దేవిశెట్టి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. జ్యూరీకి డెలాయిట్ సంస్థ సలహాదారుగా వ్యవహరిస్తోంది. ఇక, ఈ అవార్డును గతంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ (2024), ఎస్. జైశంకర్ (2023), నిర్మలా సీతారామన్ (2021), దేవేంద్ర ఫడ్నవిస్ (2019), కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ (2017), పీయూష్ గోయల్ (2015) వంటి ప్రముఖులు అందుకున్నారు. ఇక, ఈ ప్రతిష్టాత్మక అవార్డు సీఎం చంద్రబాబుకు దక్కడం పట్ల రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. పలువురు ప్రముఖులు, మంత్రివర్గ సహచరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
