Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: గోదావరి జిల్లాల చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా కీలక అడుగు.. రేపు పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా శంకుస్థాపన..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం వేస్తోన్న కీలక అడుగుకు శుభ ముహూర్తం ఖరారైంది. 3 వేల 50 కోట్ల రూపాయలతో చేపట్టే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు ఈ నెల 20న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. పెరవలిలోని ఎన్‌హెచ్ 216ఏ దగ్గర ఆర్‌కే రైస్ మిస్ సమీపంలో నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా అధునాతన సాంకేతికతతో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద ధవళేశ్వరం, బొబ్బర్లంక, వేమగిరి సమీపంలో నుండి గోదావరి జలాలు శుద్ధి చేసి తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ తదితర 5 జిల్లాల్లోని 23 నియోజకవర్గాలు, 66 మండలాల్లోని రూ.67 లక్షల 82 వేల. మంది ప్రజలకు లబ్ధి చేకూరనుంది. ఇందులో భాగంగా 1,650 కోట్ల రూపాయాలతో ఉమ్మడి తూర్పుగోదావరిలోని కాకినాడ, డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరిలోని 11 నియోజకవర్గాలు, 32 మండలలాల్లోని 39 లక్షల 64 మంది ప్రజలకు, రూ.1,400 కోట్లతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, పశ్చిమగోదావరి, ఈస్ట్ గోదావరి కొవ్వూరు, నిడదవోలు తదితర ప్రాంతాలు 12 నియోజకవర్గాలు, 34 మండలాల్లోని 28 లక్షల 18 వేల మంది ప్రజలకు త్రాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. జల్ జీన్ మిషన్ నిధులతో రెండు దశల్లో నిర్మాణ పనుల పూర్తికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 2 ఏళ్లలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనుల పూర్తికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

Read Also: SIGMA : జాసన్ సంజయ్ సిగ్మా.. షూటింగ్ ఫినిష్.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

గోదావరి డెల్టా ప్రాంతంలో భూగర్భ జలాలు ఉప్పు నీరుగా మారడం, కలుషితం కావడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాజెక్ట్ ను సకాలంలో పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపనుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి, నిడదవోలు శాసనసభ్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. అలాగే ధవళేశ్వరం వద్ద అత్యాధునిక సాంకేతికతతో కూడిన వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మించి గ్రావిటీ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నీటిని శుద్ధి చేసి పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి తాగునీరు అందించనున్నామన్నారు. ఇన్నేళ్లుగా అఖండ గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ గోదావరి వాసులకు త్రాగునీరు సమస్య వెంటాడేదని, కేంద్ర సహకారం, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ చొరవతో ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందనుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిడదవోలు పర్యటనకు తొలిసారిగా విచ్చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతం పలకాలని, కార్యక్రమంలో ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పర్యటనను దిగ్విజయం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.

Exit mobile version