శ్రామికులే లేకపోతే దేశ నిర్మాణం లేదని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. మేడే సందర్భంగా శ్రామికులతో పవన్‌కల్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘కార్మిక దినోత్సవం నుంచి కూలీలు కాదు ఉపాధి శ్రామికులు అని పిలుస్తాం. శ్రామికుల మాటలు వింటుంటూ ఎంతో ఆనందం కలిగింది. మేము కూడా నా చిన్నప్పుడు 3 ఎకరాలు అమ్ముకున్నాం. పాతికేళ్ల క్రితం 8 ఎకరాలు కొనుక్కున్నా. కండ కరిగించే వాళ్లు లేకపోతే గ్రీన్ రివల్యూషన్స్ రావు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా అవసరం. శ్రామికులే లేకపోతే దేశ నిర్మాణం లేదు. ఓట్ల కోసం నేను ఏ పనీ చేయడం లేదు. మూగ జీవాలకు చేస్తే ఓటెయ్యవు. మాకు ఓటు గురించి ఆలోచన లేదు. ఏపీ పంచాయితీరాజ్ శాఖ కూడా దాహార్తి నుంచి మూగజీవాలను రక్షించడానికి పూనుకుంది.’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: PM Modi: అమరావతిలో మోడీ సభకు వాన గండం..! అధికారులు ప్రత్యేక దృష్టి
‘‘పంచాయితీరాజ్ నిధులు ఇప్పుడు మన రాష్ట్రానికి ఆక్సిజన్ అయ్యాయి. గత ఆర్ధిక సవత్సరంలో రూ.10,669 కోట్లు ఖర్చు చేశాం. వేతనాలకు రూ.6,190 కోట్లు.. మిగిలినది మెటీరియల్ కింద ఖర్చు చేశాం. పల్లె పండుగలో భాగంగా రూ.377.37 కోట్లతో 21,564 గోకులాలు పూర్తి చేశాం. 13,500 పశువుల తొట్టెలు రూ.60.75 కోట్లతో పూర్తి చేయడానికి కారణం శ్రామికులే. రూ.1800 కోట్లతో 36 వేల ఎస్సీ, ఎస్టీ, ఇతర కాలనీలలో రోడ్లు వేశాం. డోలీ తప్ప ఇంకేం లేని చోటికి కూడా అంబులెన్స్ వెళుతోంది. ఉపాధి శ్రామికుల సంక్షేమం మాకు చాలా ప్రాధాన్యం. ఉపాధి శ్రామికుడు పని ప్రదేశంలో మరణిస్తే చెల్లించే రూ. 50 వేలు ఇప్పుడు రూ. 2 లక్షలకు పెంచాం. ఉపాధి శ్రామికులు ఎండాకాలం ఉదయం 11 లోపు పూర్తి చేయాలి. అవసరం అయితే సాయంత్రం 4 గంటల తర్వాత మళ్లీ చేయాలి. ఉపాధి శ్రామికులకు గ్రామాల్లో ఏఎన్ఎంల సేవలు, వైద్య సదుపాయం ఉంటుంది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. ఉపాధి శ్రామికులకు రూ.3 లక్షల నుంచీ రూ.30 లక్షల ఉచిత ప్రమాద భీమా ఇవ్వడానికి ఎస్‌బీఐతో ఒప్పందం చేసుకున్నాం. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని మా ప్రభుత్వానికి ఉపాధి శ్రామికుల సంక్షేమం ధ్యేయం. పని చేసే వాళ్లు ముందుంటే దేశం వెనుకబడదు. పని చేసేవాళ్లకు అత్యధిక గౌరవం ఇవ్వాలి.’’ అని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Amaravati: రేపు డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై నిషేధం.. కనిపిస్తే కఠిన చర్యలకు ఆదేశం
