Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జనసేన శాసనసభా పక్ష సమావేశం జరిగింది. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మూడు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు పాల్గొన్నారు. చట్ట సభల్లో ప్రజల గొంతుక వినిపించాలని దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్.. వైసీపీ సభ్యులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సంయమనం కోల్పోవద్దు.. సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు సరైన సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు పవన్. చట్టసభల్లో వాడే భాష విషయంలో సభ్యులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, అభ్యంతరకర పదజాలం వాడొద్దని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ సభ్యులు..అసెంబ్లీలో వాడిన భాష, వ్యవహరించిన తీరును ప్రజలంతా గమనించిన సంగతిని గుర్తించుకోవాలన్నారు.
Read Also: Amaravati ORR: అమరావతి అభివృద్ధిలో మరో ముందడుడు.. కేంద్రం గెజిన్ నోటిఫికేషన్..
ఈ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు దిగజారుడు వ్యాఖ్యలు చేసినా …హుందాగా స్పందించాలని సూచించారు. భాష విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో సభ్యులకు దిశానిర్దేశం చేయాలని నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్, హరిప్రసాద్‌లను ఆదేశించారు. అసెంబ్లీ, మండలిలో సమస్యలపై ప్రస్తావించేటప్పుడు భాష సరైనదిగా ఉండాలన్నారు. అసెంబ్లీ, మండలిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నియోజకవర్గాల సమస్యలను ప్రస్తావించాలని, నియోజకవర్గ అవసరాలతో పాటు రాష్ట్ర ప్రజల అవసరాలనూ దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు పవన్‌కల్యాణ్. జనసేన పార్టీ…సామాన్యుడి గొంతు ప్రతిధ్వనించేలా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించేలా, వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరేలా, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చట్టసభల్లో వాణి వినిపించాలని ఆదేశించారు. పార్టీ తరపున ఎన్నికైన ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చర్చల్లో పాల్గొనాలని సూచించారు. నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన పెంచుకుని…రాష్ట్రవ్యాప్తంగా ఆ తరహా సమస్యలు ఉంటే వాటిని క్రోడీకరించి చర్చల్లో పాల్గొనాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయం, ఖర్చు, శాఖలవారీగా కేటాయింపులు, అప్పులు ఇతరత్రా అంశాలపై ప్రతి సభ్యుడు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, కొత్తగా ఎన్నికైన సభ్యులకు సందేహాలు ఉంటే సీనియర్లతో చర్చించి వారు సూచించిన విధంగా ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. పవన్ దిశానిర్దేశం చేయడంతో ఈసారి జనసేన ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో బలమైన గొంతు వినిపించబోతున్నారని అర్థమవుతోంది.