NTV Telugu Site icon

CM Chandrababu: దేనికి లోటు లేదు.. పెట్టుబడులతో ఏపీకి రండి..

Babu 2

Babu 2

Davos Day 2: దావోస్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది.. పోర్టులు, మానవ వనరులకు లోటు లేదు.. పెట్టుబడులతో రండి అంటూ వివిధ సంస్థలను ఆహ్వానించారు సీఎం.. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలలో ఒకటైన డెన్మార్క్‌కు చెందిన మార్స్క్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. 130 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ప్రపంచ రవాణా రంగంలో రారాజులా వున్న మార్స్క్ రాష్ట్రానికి వస్తే సముద్రరవాణాలో ఏపీ దేశంలోనే అగ్రగామి రాష్ట్రం అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు రెండో రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్స్క్ కంపెనీ సీఈవో విన్సెంట్ క్లర్క్‌తో కీలక చర్చలు జరిపారు. వెయ్యి కిలోమీటర్ల పైనే తీరప్రాంతం కలిగి వుండటం, విస్తారంగా పోర్టులు ఉండటం… ఆంధ్రప్రదేశ్ బలమని, మానవ వనరులకు లోటు లేదని… విన్సెంట్ క్లర్క్‌కు ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా భారీ ఉత్పత్తులు, వాణిజ్య వస్తువులు సముద్ర మార్గం ద్వారా రవాణా చేయడంలో మార్స్క్‌ కు తిరుగులేదన్నారు సీఎం చంద్రబాబు… మార్స్క్ ఏపీకి వస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. రాష్ట్రంలోని ఓడరేవులు, ప్రధానంగా విశాఖపట్నం పోర్టు మరింత అభివృద్ధి చెందుతాయని.. ఆసియా పసిఫిక్ మార్కెట్లకు రవాణా హబ్‌గా ఏపీ మారే అవకాశం ఉంటుందన్నారు సీఎం.. అటు ఎగుమతులు, దిగుమతుల రంగం బలపడుతుందని.. ఏపీ ఒక గ్లోబల్ లాజిస్టిక్ హబ్‌గా ఎదగడమే కాకుండా, భారతదేశ ఆర్థిక వృద్ధిలో ప్రధాన పాత్ర పోషించేందుకు దోహదపడుతుందన్నారు చంద్రబాబు.. ఆప్టికల్, వైర్‌లెస్, మొబిలిటీ వంటి నెట్‌వర్కింగ్‌లో సాంకేతికతలను అందించడం, డేటా సెంటర్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో పేరున్న మల్టీ-నేషనల్ టెక్నాలజీ సంస్థ సిస్కో చైర్మన్, సీఈవో చుక్ రాబిన్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. టెక్నాలజీ ఇన్నోవేషన్‌లో గ్లోబల్ లీడర్‌గా వున్న సిస్కో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామి కావాలని చుక్ రాబిన్స్ దగ్గర ముఖ్యమంత్రి తన ఆకాంక్ష వ్యక్తం చేశారు. విశాఖపట్నం లేదా తిరుపతిలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటుకు యోచన చేయమని.. రాష్ట్రంలో ప్రతిభకు లోటు లేదని చెప్పారు. APలో నెట్‌వర్క్ భాగాల తయారీకి ఆహ్వానించారు.

రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను తీసుకువచ్చేందుకు దావోస్ సదస్సులో ముఖ్యమంత్రి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వివిధరంగాలకు చెందిన కంపెనీల సీఈవోలతో, అధిపతులతో చర్చలు జరుపుతున్నారు. ఎల్జీ కెమ్ లిమిటెడ్ సీఈవో షిన్ హక్ చియోల్‌కు రాష్ట్రంలో వివిధరంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. ఎల్జీ కెమ్ దక్షిణ కొరియాలో అతిపెద్ద కెమికల్ కంపెనీ, 1.5 బిలియన్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు యోచనలో వున్న ఎల్జీ కెమ్‌ అనుబంధ సంస్థ ఎనర్జీని రాష్ట్రంలో నెలకొల్పాల్సిందిగా ముఖ్యమంత్రి ఈ భేటీలో కోరారు. పెట్రో కెమికల్ రంగంలో యూనిట్లు మూలపేట – విశాఖలోనూ, సెమీకండక్టర్ యూనిట్ తిరుపతిలోనూ నెలకొల్పేందుకు వున్న అవకాశాలను పరిశీలించమని సూచించారు. రాష్ట్రంలో తయారీకి అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు వేగంగా ప్లాంట్ ఏర్పాటయ్యేలా పూర్తి మద్దతిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్, దక్షిణ కొరియా మధ్య పెట్టుబడుల కోసం ఎల్జీ కెమ్ సీఈవోను అంబాసిడర్‌గా ఉండాలని అభ్యర్ధించారు.

పళ్ల రసాలు, శీతల పానీయాలు, బీర్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌, ఉత్పత్తి చేసే కార్ల్స్ బెర్గ్ గ్రూప్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్‌తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ఇంటిగ్రేటెడ్ బ్రూవరీ, బాట్లింగ్ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయమని అభ్యర్థించారు. ఇందుకోసం విశాఖపట్నం, కృష్ణపట్నం, శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించమని చెప్పారు. బార్లీ, మొక్కజొన్న, వరి వంటి అధిక నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని రైతులతో భాగస్వామి కావాల్సిందిగా కోరారు. అనకాపల్లిలో రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడితో 17.8 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్టుపై ఆర్సెలార్ మిట్టల్/నిప్పన్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ ఎన్. మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ఈ బృహత్తర గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ ఇటీవలి కాలంలో రాష్ట్రానికి వచ్చిన అతిపెద్ద పెట్టుబడులలో ఒకటిగా నిలిచింది. అలాగే వెల్స్‌పన్ చైర్మన్ బీకే గోయింకాతో కూడా పెట్టుబడులపై చర్చలు జరిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..