Site icon NTV Telugu

CM Chandrababu: మంత్రులు, సీనియర్‌ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. జాగ్రత్త.. వైసీపీ ట్రాప్‌లో పడొద్దు..!

Cbn

Cbn

CM Chandrababu: రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ మంత్రులు, సీనియర్ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండాలని, వారి ట్రాప్‌లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అధికారం కోల్పోయామనే అసహనంతోనే వైసీపీ రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేస్తోందన్న చంద్రబాబు.. వైసీపీ నాయకులు చేసిన తప్పుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్‌లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ పడకూడదని సూచించారు.

Read Also: Sanjay Raut: అజిత్ పవార్ మరణంపై ఏదో సందేహం కలుగుతోంది.. దర్యాప్తు చేయాలన్న సంజయ్ రౌత్

రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసే బాధ్యత మంత్రులు, సీనియర్ నేతలపై ఉందని సీఎం స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించేలా నాయకులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితి ఎక్కడా రాకూడదని హెచ్చరించారు చంద్రబాబు.. పెట్టుబడులు సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని చంద్రబాబు పేర్కొన్నారు. గత 20 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, ఏపీకి భారీగా పెట్టుబడిదారులు వస్తున్నారని తెలిపారు. ఈ అభివృద్ధి వైసీపీకి నచ్చడం లేదని, అందుకే దాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తీరుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే ప్రయత్నాలను ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు.

మరోవైపు.. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడా టీడీపీ మంత్రులు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే వైసీపీ ప్లాన్‌ను ప్రజలు ఇప్పటికే తిరస్కరిస్తున్నారని నేతలు వ్యాఖ్యానించారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే వైసీపీ నేతలు బూతు పురాణం ఎత్తుకున్నారని విమర్శించారు. వైసీపీ నేతల కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోవద్దని టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నేతలకు సూచించారు. మొత్తంగా రాష్ట్ర శాంతిభద్రతలు, అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని నేతలు స్పష్టం చేశారు.

Exit mobile version