CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన అధ్యక్షతన ఎస్ఐపీబీ (SIPB) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొంతమంది మంత్రులు ప్రత్యక్షంగా, మరికొంతమంది వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ‘వైజాగ్ పార్ట్నర్షిప్ సమ్మిట్’పై ప్రధానంగా చర్చించారు. ఈ భేటీకి మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, టీజీ భరత్, వాసంశెట్టి సుభాష్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. విశాఖ పెట్టుబడుల సదస్సును విజయవంతం చేయడంతో పాటు రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకురావడంపై సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలను సమావేశంలో సమీక్షించారు చంద్రబాబు.. కొత్త పరిశ్రమలకు అనుమతులు, భూకేటాయింపులు, ప్రభుత్వపరమైన అనుమతుల ప్రక్రియపై చర్చించారు. ఇప్పటికే ఆమోదం పొందిన పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిని కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. పెట్టుబడుల అమలులో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై అధికారులతో చర్చించారు. పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ఇక, భవిష్యత్తులో భారీ ఉపాధి అవకాశాలను కల్పించే సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ రంగాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక వసతుల కల్పనపై చర్చించారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు, పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన విద్యుత్, నీరు, రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పోర్టులు, రవాణా వ్యవస్థలు, సరకు రవాణా కేంద్రాల మధ్య మెరుగైన అనుసంధానం కల్పించడం ద్వారా పారిశ్రామిక రంగానికి మరింత ఊతమివ్వాలని చర్చించారు. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. పెట్టుబడులకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు దారితీయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమల స్థాపనలో అనవసర జాప్యాన్ని నివారించాలని, నిర్ణీత గడువులోగా అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. పెట్టుబడిదారులకు వేగంగా సేవలు అందించడంతో పాటు ఇప్పటికే ఆమోదం పొందిన ప్రాజెక్టులను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మొత్తంగా ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పరిశ్రమల ఏర్పాటు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనకు ఈ సదస్సును కీలక వేదికగా మార్చాలని యోచిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

