CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం.. మంత్రులతో సీఎం ప్రత్యేకంగా కీలక చర్చలు జరిపారు. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిణామాలు, అభివృద్ధి కార్యాచరణపై మంత్రివర్గ సభ్యులతో విస్తృతంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు పీపీపీ (PPP– Public Private Partnership) విధానాన్ని విజయవంతంగా అనుసరిస్తున్నాయని సీఎం తెలిపారు. అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పీపీపీ విధానంపై కూడా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని వెల్లడించారు.
Read Also: Bangladesh: దీపు చంద్ర దాస్ హత్యలో కీలక నిందితుడి అరెస్ట్.. మసీదు బోధకుడే సూత్రధారి..
ఇక, ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల విషయంలో ఫోర్బ్స్ జాబితాలో జాతీయ స్థాయిలో పేరు రావడం గర్వకారణమని, ఇది రాష్ట్ర అభివృద్ధికి శుభసూచిక అని ఆనందం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు… ఈ విషయాలను మంత్రులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధిలో లాజిస్టిక్స్ వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, ఇందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. జలరవాణాను మెరుగుపరచి ఇన్‌ల్యాండ్ వాటర్‌వేలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
తీరప్రాంత మౌలిక సదుపాయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు.. ప్రతీ తీర జిల్లాలో ఒక పోర్టు ఏర్పాటు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన.. లాజిస్టిక్స్ రంగంలో ఏపీ ప్రపంచ దేశాలతో పోటీపడేలా ఎదగాలన్నారు.. దీనికి అనుగుణంగా పోర్టుల అభివృద్ధి, కార్గో రవాణా, వాణిజ్య అవకాశాలు పెంచాలి అని సూచించారు. విద్యుత్ రంగంపై కూడా సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం విధించిన రూ.4,490 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై పడకుండా.. ప్రస్తుత ప్రభుత్వమే భరిస్తోందని వెల్లడించారు. విద్యుత్ యూనిట్ ధరను రూ.5.19 నుంచి రూ.4.90కి తగ్గించామని, మార్చి 2026 నాటికి దాన్ని రూ.4.80కి తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఈసారి ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేపట్టిందని, రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేలా అవగాహన కల్పించాలని సూచించారు. చివరిగా, పర్యాటక రంగంలో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుని రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా మార్చాలన్నది ప్రభుత్వ సంకల్పమని సీఎం పేర్కొన్నారు. మంత్రులు ప్రభుత్వ నిర్ణయాలు, సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి.. రాష్ట్ర ప్రగతికి భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
