CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు 50 ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం చుట్టనుంది ప్రభుత్వం.. ఈ రోజు ఉదయం 11 గంటలకు 50 ఎంఎస్‌ఎంఈ పార్కులను ప్రారంభించనుంది.. ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి పారిశ్రామిక పార్కులను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వర్చువల్ పద్ధతిలో జరుగనున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడు నుంచి ముఖ్యమంత్రి ఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రెండో దశలో భాగంగా 329 ఎకరాల విస్తీర్ణంలో రూ.134 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన 15 పారిశ్రామిక పార్కులను సీఎం ప్రారంభించనున్నారు.
Read Also: Polling Delay: మొరాయించిన ఈవీఎంలు.. షేక్పేట్లో ప్రారంభం కానీ పోలింగ్..
వీటితో పాటు 587 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న 32 ప్రభుత్వ ఎంఎస్ఎంఈ పార్కులు, 3 ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అనంతపురం, కాకినాడ, తూర్పుగోదావరి, ప్రకాశం, కడప, విజయనగరం, పార్వతీపురం మన్యం, సత్యసాయి, ఏలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, కర్నూలు, అన్నమయ్య, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఈ పారిశ్రామిక పార్కుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతాయి. రాష్ట్రంలో మొత్తం 17 జిల్లాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం చుట్టనున్నారు. 900 ఎకరాల విస్తీర్ణంలో రూ.810 కోట్ల పెట్టుబడులతో ఈ పార్కులు అభివృద్ధి చేయబడ్డాయి. ఇవి పూర్తయ్యే సరికి సుమారు 12 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పెదఈర్లపాడులో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.7 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ పార్కుల ఏర్పాటు “వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్” లక్ష్యంతో చేపట్టబడింది..
