Site icon NTV Telugu

CM Chandrababu: రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం.. కీలక అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

Cbn

Cbn

CM Chandrababu: రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆయన అధ్యక్షతన సచివాలయంలో 233, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రైతులకు రుణాలు, ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకుల సహకారం, ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో కొత్త ఏడాదిలో చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. వార్షిక రుణ ప్రణాళిక అమలు, వ్యవసాయ రుణాలు, అనుబంధ రంగాల అభివృద్ధి, ఎంఎస్ఎంఈల రుణాల ప్రగతి అంశాలను సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఇప్పటివరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.2.96 లక్షల కోట్ల మేర రుణాలు మంజూరు చేసినట్లు బ్యాంకర్లు సీఎంకు వివరించారు. కౌలు రైతులకు రూ.1490 కోట్ల వ్యవసాయ రుణాలు అందజేసినట్టు తెలిపారు.

Read Also: CM Stalin: ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్..

అలాగే ఎంఎస్ఎంఈల రంగానికి సంబంధించి రూ.95,714 కోట్ల మేర రుణాలు జారీ చేసిన విషయాన్ని బ్యాంకర్లు వెల్లడించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత మద్దతు అందించి ఉపాధి అవకాశాలు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు సూచించారు. అమరావతిని ఫైనాన్షియల్ హబ్‌గా అభివృద్ధి చేయడం, రాజధానిలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (CBD) ఏర్పాటు అంశాలపై కూడా బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమాలోచనలు జరిపారు. ఈ ప్రణాళికలకు బ్యాంకుల సహకారం అత్యవసరమని పేర్కొన్నారు. ఏపీ టిడ్కో రుణాలు, డ్వాక్రా సంఘాల బ్యాంక్ లింకేజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు బ్యాంకుల సహకారం, స్టార్టప్‌లకు రుణ సౌకర్యాలు వంటి అంశాలపై సీఎం విస్తృతంగా సమీక్షించారు. ప్రజలకు సులభంగా రుణాలు అందేలా ప్రక్రియలను మరింత సరళతరం చేయాలని బ్యాంకులకు సూచించారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, ముఖ్య కార్యదర్శి విజయానంద్, యూనియన్ బ్యాంక్ ఎండీ, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్, నాబార్డు జీఎం హాజరయ్యారు. వివిధ జాతీయీకృత, ప్రైవేట్ బ్యాంకుల ప్రతినిధులు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ డైరెక్టర్లు కూడా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బ్యాంకర్లు భాగస్వాములుగా ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

Exit mobile version