Site icon NTV Telugu

CM and Deputy CM Key Meeting: రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. వరుస ఘటనల నేపథ్యంలో ప్రాధాన్యత..!

Pawan Babu

Pawan Babu

CM and Deputy CM Key Meeting: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేపు (మంగళవారం) జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న వరుస అవాంఛనీయ ఘటనలు, పాలనాపరమైన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం వేదిక కానుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు మరియు ప్రజారోగ్యానికి సంబంధించి తలెత్తిన కొన్ని అంశాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి.. దీంతో, ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

* వేట్లపాలెం పేలుడు: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ ప్రమాదానికి కారణాలు, బాధితులకు అందుతున్న సహాయం మరియు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన కఠిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.

* అతిసార మరియు కల్తీ పాలు: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అతిసార వ్యాప్తి, అలాగే కల్తీ పాల నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి నివేదికలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పరిశీలించనున్నారు.

* టీటీడీ అంశంపై ప్రత్యేక చర్చ: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చుట్టూ తిరుగుతున్న తాజా పరిణామాలు ఈ భేటీలో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. లడ్డూ కల్తీ మరియు వన్ మెన్ కమిటీపై చర్చించనున్నారు.. గతంలో సంచలనం సృష్టించిన లడ్డూ కల్తీ వ్యవహారం మరియు దానిపై విచారణ జరుపుతున్న వన్ మెన్ కమిటీ పురోగతిని వారు సమీక్షించనున్నారు.

* నామినేటెడ్ పోస్టుల భర్తీ: కూటమి ప్రభుత్వంలో కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియపై కూడా ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రెండో విడతలో భర్తీ చేయాల్సిన పోస్టులు, పార్టీల వారీగా కేటాయింపులపై ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే అంశాలను సమర్థంగా తిప్పికొట్టడంతో పాటు, కూటమి పక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం ఈ భేటీ ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది.

Exit mobile version