CM Chandrababu: హెల్తీ.. వెల్తీ.. హ్యాపీ ఏపీ.. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్.. 2047 నాటికి నంబర్ వన్ లక్ష్యం

Cbn

Cbn

CM Chandrababu: రాజధాని అమరావతిలోని రాయపూడి పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఆయన హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ జెండా స్వాతంత్ర్యానికి ప్రతీక మాత్రమే కాకుండా ఆత్మగౌరవానికి ప్రతిబింబం, ఐక్యతకు చిహ్నం, భవిష్యత్‌కు మార్గదర్శకమని పేర్కొన్నారు.

90 ఏళ్ల పోరాట ఫలమే స్వాతంత్ర్యం
స్వాతంత్ర్యం ఒక్కరోజులో, ఒక్కరి పోరాటంతో రాలేదని చంద్రబాబు అన్నారు. ఎన్నో దశాబ్దాల పోరాటం, తరాల ఉద్యమం, మహనీయుల బలిదానాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా మార్చారని, సుభాష్ చంద్రబోస్ ధైర్యాన్ని దేశభక్తికి ప్రతీకగా నిలిపారని గుర్తుచేశారు. భగత్ సింగ్ త్యాగం యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించిందన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేయగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించారని సీఎం పేర్కొన్నారు. తెలుగు నేల కూడా స్వాతంత్ర్య సమరంలో తనదైన ముద్ర వేసిందన్నారు. అల్లూరి సీతారామరాజు పోరాటం, పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా తెలుగు ప్రజలకు గర్వకారణమని అన్నారు.

2047 నాటికి దేశం, రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలి
80 ఏళ్ల క్రితం మన పెద్దలు స్వేచ్ఛా భారతదేశం కోసం కలలు కన్నారని, పోరాడి ఆ స్వేచ్ఛను మనకు అందించారని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు దేశ నిర్మాణం కోసం పనిచేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశం మనకు హక్కులు, గుర్తింపు, గౌరవం ఇచ్చిందని, ఇప్పుడు దేశానికి మనం ఏం ఇవ్వగలమనే ఆలోచన చేయాల్సిన సమయం వచ్చిందని సీఎం అన్నారు. ‘నా దేశం-నా బాధ్యత’ అనే భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చేతిలో జాతీయ జెండాతో పాటు గుండెల్లో బలమైన అజెండా ఉండాలని అన్నారు. రాబోయే 20 ఏళ్ల పాటు లక్ష్య సాధన కోసం నిరంతరం పనిచేస్తామని ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ నైపుణ్యంతో ఆవిష్కరణలు చేయాలని, రైతులు ప్రకృతి సాగు ద్వారా ప్రజల ఆరోగ్యం, భూసారాన్ని కాపాడాలని అన్నారు. ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి సామాజిక బాధ్యతను నిర్వర్తించాలని, మహిళలు అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలని సూచించారు. వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమేనన్నారు.

వికసిత్ భారత్ 2047.. స్వర్ణాంధ్ర 2047
ప్రతి ఒక్కరి ఆలోచన చిన్నదిగా అనిపించినా కోట్లాది మంది భారతీయులు కలిస్తే అది దేశ సంకల్పంగా మారుతుందని చంద్రబాబు అన్నారు. అందరం కలిసి కొత్త స్వప్నాన్ని సాకారం చేయాలని, అదే ‘వికసిత్ భారత్ 2047’, ‘స్వర్ణాంధ్ర 2047’ లక్ష్యాలని పేర్కొన్నారు. 80 ఏళ్ల క్రితం స్వేచ్ఛ సాధించుకున్నామని, వచ్చే 20 ఏళ్లలో ప్రపంచాన్ని గెలవాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని నిర్దేశించారని, ఆంధ్రప్రదేశ్ ‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాన్ని పెట్టుకుందని సీఎం చెప్పారు. ఈ రెండు లక్ష్యాలు పరస్పరం భిన్నమైనవి కావని స్పష్టం చేశారు. బలమైన రాష్ట్రం వికసిత్ భారత్‌కు పునాది అవుతుందని, బలమైన దేశం స్వర్ణాంధ్ర నిర్మాణానికి అండగా నిలుస్తుందని అన్నారు. దేశం కోసం చేసే ప్రతి పని స్వర్ణాంధ్ర నిర్మాణంలో భాగమని, స్వర్ణాంధ్ర కోసం చేసే ప్రతి పని వికసిత్ భారత్ నిర్మాణంలో భాగమని పేర్కొన్నారు. ఐక్యంగా, బాధ్యతగా పనిచేసి స్వర్ణాంధ్రను నిర్మిస్తూ వికసిత్ భారత్‌ను సాకారం చేద్దామని పిలుపునిచ్చారు.

ఎన్నో సవాళ్లు దాటి ఆంధ్రప్రదేశ్ ప్రయాణం
స్వతంత్ర భారతదేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, ఆంధ్రప్రదేశ్ కూడా అనేక ఒడిదుడుకులను అధిగమించిందని చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని గుర్తుచేశారు. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్ అవతరించిందని వివరించారు. 2014లో మరోసారి రాష్ట్ర విభజన జరిగిందని, ప్రతిసారీ సవాళ్లు, సంక్షోభాలు ఎదురైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్టుదలే గెలిచిందని అన్నారు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇచ్చారని, విభజన కష్టాలను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రయత్నించామని తెలిపారు.

2019-24 కాలం చీకటి రోజులు
2019లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చంద్రబాబు విమర్శించారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని, వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. గత పాలకుల అహంకారం, అసమర్థత, అవినీతి, అరాచకంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. ఆర్థికంగా కూడా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో నరేంద్ర మోదీ, పవన్ కల్యాణ్‌తో కలిసి కూటమిగా ప్రజల ముందుకు వెళ్లామని చంద్రబాబు తెలిపారు. ‘ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలి’ అనే నినాదంతో ప్రజలను కోరామని, కూటమిపై నమ్మకంతో ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని అందించారని అన్నారు. 94 శాతం స్ట్రయిక్ రేట్, 57 శాతం ఓట్ షేర్‌తో ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ఆ తీర్పును అధికారంగా కాకుండా రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన బాధ్యతగా స్వీకరించామని అన్నారు. పాలకులుగా కాకుండా ప్రజలకు సేవకులుగా పనిచేస్తున్నామని తెలిపారు.

26 నెలల్లో మార్పు కనిపించేలా చేశాం
తొలి సంతకం నుంచే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు అన్నారు. 26 నెలల్లో ప్రజలకు మార్పు కనిపించేలా చేశామని తెలిపారు. విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి స్థిరత్వం వైపు, అనిశ్చితి నుంచి ఆత్మవిశ్వాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి స్పష్టమైన లక్ష్యం, ప్రయాణానికి నిర్దిష్టమైన గమ్యం ఉండాలనే ఉద్దేశంతో విస్తృత చర్చల అనంతరం ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్ రూపొందించామని సీఎం తెలిపారు. ‘హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ’ లక్ష్యంగా 10 సూత్రాలను రూపొందించామని చెప్పారు. అవి పేదరికం లేని సమాజం, ఉద్యోగ-ఉపాధి కల్పన, నైపుణ్యం-మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, ఫార్మర్-అగ్రిటెక్, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ అని వివరించారు.

ప్రతి నియోజకవర్గం అభివృద్ధి యూనిట్
లక్ష్యాలు పెట్టుకోవడం మాత్రమే కాకుండా వాటిని సాధించేందుకు కార్యాచరణ అవసరమని చంద్రబాబు అన్నారు. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి యూనిట్‌గా తీసుకుని విజన్ యాక్షన్ ప్లాన్‌లు రూపొందించామని తెలిపారు. అభివృద్ధి ఒక్క నగరానికే పరిమితం కాకూడదని, మూడు ప్రాంతాలు, ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ప్రభుత్వ విధానమని, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.

విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్లు
విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధికి కార్యాచరణ చేపట్టామని సీఎం వెల్లడించారు. ఆధునిక టెక్నాలజీ, అపారమైన నాలెడ్జ్‌ను సమర్థంగా వినియోగించుకునేలా అన్ని ప్రాంతాల్లో నాయకత్వాన్ని తయారు చేస్తున్నామని తెలిపారు. అప్పుడే అన్ని రంగాల్లో విజయం సాధ్యమవుతుందని అన్నారు. 26 నెలల క్రితం ప్రభుత్వం పాలన ప్రారంభించినప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ప్రజల మద్దతు, కూటమి ఐక్యత, కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్రానికి కొత్త ఊపిరి పోశాయని పేర్కొన్నారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, అంతర్జాతీయ పెట్టుబడులు వంటి అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని తెలిపారు.

వృద్ధి రేటు 11.3 శాతానికి పెరిగింది
2014-19 మధ్య రాష్ట్ర వృద్ధి రేటు 13.5 శాతంగా ఉండగా, 2019-24 మధ్య 10.3 శాతానికి పడిపోయిందని చంద్రబాబు చెప్పారు. అన్ని వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టడంతో ప్రస్తుతం వృద్ధి రేటు 11.3 శాతానికి పెరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన రూ.9.74 లక్షల కోట్ల అప్పులు, బకాయిలు రాష్ట్రానికి భారంగా మారాయని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నమ్మకంతో ముందుకు సాగిందని, 370 రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రుణాల రీషెడ్యూల్ ద్వారా ఇప్పటివరకు రూ.8,269 కోట్లు ఆదా అయ్యేలా చేశామని వెల్లడించారు.

సంక్షేమం, అభివృద్ధికి భారీ వ్యయం
గత ప్రభుత్వం నిలిపివేసిన 86 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించామని చంద్రబాబు తెలిపారు. 26 నెలల్లో రూ.1.50 లక్షల కోట్లను సంక్షేమానికి, రూ.1.34 లక్షల కోట్లను అభివృద్ధికి ఖర్చు చేశామని పేర్కొన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్రను నిర్మించాలంటే ప్రభుత్వం మాత్రమే కాదు.. ప్రజలందరూ భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. వ్యక్తిగత బాధ్యతను దేశ, రాష్ట్ర అభివృద్ధితో అనుసంధానం చేస్తూ ప్రతి ఒక్కరూ ముందుకు సాగితేనే ‘స్వర్ణాంధ్ర 2047’, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాలు సాకారం అవుతాయని ఆయన స్పష్టం చేశారు.