Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?

Dola Bala Veeranjaneya Swam

Dola Bala Veeranjaneya Swam

Minister Dola Veeranjaneya Swamy : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ‘చలో విజయవాడ’ ఆందోళనపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సీరియస్‌గా స్పందించారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలు చేపట్టిందని ఆయన విమర్శించారు. అయితే ఉద్యోగుల సమస్యలను తమ ప్రభుత్వం గాలికి వదిలేయలేదని, మెరుగైన పౌర సేవల కోసం సచివాలయ ఉద్యోగులను వినియోగిస్తున్నామని తెలిపారు. గణేష్‌ నిమజ్జనం, వరదల పరిస్థితుల నేపథ్యంలో ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని ముందుగానే కోరామని మంత్రి చెప్పారు. అయినప్పటికీ నిన్న విజయవాడలో కార్యక్రమం నిర్వహించారని, ఆందోళనలో అసాంఘిక శక్తులు కూడా ఉన్నాయని ఆరోపించారు. నిన్న జరిగిన ఘటనలు బాధాకరమని, చట్ట ప్రకారం అన్ని అంశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లు, నోషనల్‌ ఇంక్రిమెంట్లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని మంత్రి డోలా తెలిపారు. ప్రమోషన్‌ ఛానల్‌ను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని శాఖల్లో ప్రమోషన్లు కల్పించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశామని వివరించారు. ఇటీవల అర్హులైన సచివాలయ ఉద్యోగులకు పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల సమస్యల్లో చాలా వరకు పరిష్కరించామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిగణనలోకి తీసుకోకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులనే భావనతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా చేపట్టే కార్యక్రమాలను సహించబోమని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఎందుకు ప్రమోషన్లు ఇవ్వలేదని, పీఆర్సీ ఎందుకు అమలు చేయలేదని, సర్వీస్‌ రూల్స్‌ ఎందుకు పాటించలేదని మంత్రి డోలా ప్రశ్నించారు. గత ప్రభుత్వానికి ఉద్యోగులపై కక్ష ఉంటే తమ ప్రభుత్వం ప్రమోషన్లు, నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్‌ లీవ్‌ వంటి అంశాలపై ఎందుకు నిర్ణయాలు తీసుకుందని ప్రశ్నించారు. ఉద్యోగుల ఆందోళన వెనుక ఎవరున్నారనే అంశాన్ని కూడా తేల్చాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. గతంలో సీఐ మృతి ఘటనపై అప్పటి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తూ, మానవత్వం లేదా అంటూ విమర్శించారు. అయితే ఉద్యోగుల నియామకాలు ఒకసారి పూర్తయిన తర్వాత ప్రభుత్వాలు మారడం సహజమని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వపరంగా పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపారు.

అలాగే అటెండర్‌కు జీతం ఎక్కువగా ఉందనే కారణంతో అతనికి నేరుగా ఆఫీసర్‌ పోస్టు ఇవ్వలేమని స్పష్టం చేశారు మంత్రి డోలా.. ఉద్యోగుల పదోన్నతులు, పోస్టుల మార్పులు, సర్వీస్‌ నిబంధనలు నిర్దిష్ట విధానాల ప్రకారమే జరుగుతాయని, ఈ విషయాన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు గుర్తించాలని సూచించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఏదైనా సాధించగలమనే భావన సరికాదని పేర్కొన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి..