Site icon NTV Telugu

Medical Colleges through PPP Mode: వైద్య రంగంలో పీపీపీ అవకాశాలు విరివిగా వాడుకోవాలి.. సత్యకుమార్‌కు జేపీ నడ్డా లేఖ..

Jp Nadda Writes To Satya Ku

Jp Nadda Writes To Satya Ku

Medical Colleges through PPP Mode: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య రంగంలో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానాన్ని మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్కు లేఖ ద్వారా సూచించారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతుల విస్తరణ, సేవల నాణ్యత పెంపు కోసం పీపీపీ మోడల్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. PPP ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం Viability Gap Funding (VGF) కింద ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తోంది.

నడ్డా లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం:
* ప్రాజెక్టు వ్యయంలో 80% వరకు కేంద్ర–రాష్ట్ర VGF సహాయం (పైలట్ ప్రాజెక్టులకు)
* మొదటి 5 ఏళ్ల నిర్వహణ ఖర్చులో 50% వరకు VGF సహాయం
* VGF వ్యయంలో 50% కేంద్రం, 50% రాష్ట్రం భరిస్తాయి
* సాధారణ PPP ప్రాజెక్టులకు 30%–40% వరకు కేంద్ర సహాయం అందుతుంది
* వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, అత్యవసర వైద్య సేవలు, వైద్య పరికరాల ఏర్పాటు వంటి ఆరోగ్య మౌలిక ప్రాజెక్టులకు ఇది గొప్ప అవకాశమని కేంద్ర మంత్రి వివరించారు.

పీపీపీ విధానం ద్వారా ఆరోగ్య రంగంలో 7 ప్రధాన లాభాలు ఉన్నాయని మంత్రి నడ్డా లేఖలో పేర్కొన్నారు. వాటిలో ముఖ్యమైనవి.. ప్రభుత్వ లక్ష్యాల సాధన వేగవంతం అవుతుంది.. మౌలిక వసతుల విస్తరణకు ప్రైవేట్ పెట్టుబడులు లభిస్తాయి.. సేవల నాణ్యత, నిర్వహణ సామర్థ్యం మెరుగుపడుతుంది.. ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.. ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుంది.. వైద్య విద్య, పరిశోధన రంగాలకు కొత్త ఊపు వస్తుంది.. పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగి, దీర్ఘకాలిక భాగస్వామ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో అమలు చేయాల్సిన వైద్యారోగ్య PPP ప్రాజెక్టులను వెంటనే రూపొందించాలని మంత్రి సత్యకుమార్‌కు నడ్డా సూచించారు. అలాగే, కేంద్రంతో సమన్వయం కోసం ప్రత్యేక PPP సెల్‌ను ఏర్పాటు చేయాలి.. ప్రాజెక్టు డిజైన్‌లు, DPRలు త్వరగా సిద్ధం చేయాలి.. పెట్టుబడులు, టెండర్లు, అమలు ప్రక్రియలను వేగవంతం చేయాలి.. అంటూ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. PPP ప్రాజెక్టుల అమలులో కేంద్రంతో సమన్వయం కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని, అధికారుల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధం చేయాలని కూడా నడ్డా సూచించారు. దేశంలో 2000 సంవత్సరం నుంచి రోడ్లు, విమానాశ్రయాలు, టెలికాం, మౌలిక రంగాల్లో PPP ద్వారా సాధించిన విజయాలను కేంద్ర మంత్రి ప్రస్తావించారు. అదే తరహాలో వైద్య ఆరోగ్య రంగంలో కూడా PPP విధానానికి అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఏపీ వైద్య రంగంలో PPPపై కొత్త చర్చ
ఇప్పటికే రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల PPP టెండర్ల అంశం చర్చనీయాంశంగా మారిన వేళ, కేంద్ర మంత్రి లేఖ PPP విధానానికి మరింత బలాన్ని ఇచ్చేలా ఉందని, రాబోయే రోజుల్లో ఏపీ వైద్య రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version