Site icon NTV Telugu

Buggana Rajendranath Reddy: పెర్ఫామెన్స్ వీక్.. పబ్లిసిటీ పీక్.. ఇప్పటికే రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు..

Buggana Rajendranath Reddy

Buggana Rajendranath Reddy

Buggana Rajendranath Reddy: ఏపీ బడ్జెట్‌ 2026-27పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కూటమి ప్రభుత్వ పనితీరు “పెర్ఫామెన్స్ వీక్, పబ్లిసిటీ పీక్” అన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. బడ్జెట్ పుస్తకంలో బొమ్మలు తప్ప అసలు ఆదాయాలు, ఖర్చుల స్పష్టమైన వివరాలు లేవని ఆరోపించారు. ఇప్పటికే రూ.3.12 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని, కానీ రాష్ట్ర మొత్తం అప్పులపై స్పష్టత ఇవ్వలేదని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పడం పెద్ద నేరమని, బడ్జెట్‌లో చెప్పిన అనేక అంశాలు ఊహాగానాలేనని విమర్శించారు.

రూ.90 వేల కోట్లకంటే ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి లేకపోయినా, 60 శాతం పెరిగినట్టు అంచనాలు చూపిస్తున్నారని చెప్పారు. సూపర్ సిక్స్ హామీల అమలుకు ఎంత నిధులు కేటాయించారో వెల్లడించలేదని ప్రశ్నించారు బుగ్గన.. తమ హయాంలో గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, నాడు-నేడు కింద పాఠశాలలు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, పోర్టులు నిర్మించామని గుర్తుచేశారు. మహిళలు, రైతులు, విద్యార్థులకు పలు పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించామని తెలిపారు.

కాగ్ నివేదికల ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారలేదని, కేంద్రం కంటే ఆదాయ వృద్ధి ఎక్కువగా ఉందని చెప్పారు బుగ్గన… జల జీవన్ మిషన్ కింద ఖర్చు చేసిన నిధులపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి హామీలకు తగిన కేటాయింపులు లేవని ఆరోపించారు. ఉద్యోగుల బకాయిలు రూ.40 వేల కోట్లకు చేరుకున్నాయని పేర్కొన్నారు. మొత్తం మీద ఈ బడ్జెట్ ప్రజాశ్రేయస్సుకు తోడ్పడేలా లేదని, ఇది “అనాలసిస్ ఆఫ్ బడ్జెట్” కంటే “అనాలసిస్ ఆఫ్ అబద్ధాలు”గా మారిందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు.

బడ్జెట్ అనేది ప్రజాశ్రేయస్సుకు తోడ్పడే విధంగా, పద్ధతిగా అధ్యయనం చేసి రూపొందించాలి. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్‌లో అంతటి లోతైన విశ్లేషణ లేకుండా ఊహాజనితమైన లెక్కలతో మాత్రమే ఏర్పాటుచేయబడిందని విమర్శించారు బుగ్గన.. అసలు ఆదాయాలు, అప్పుల వివరాలను బడ్జెట్‌లో చూపించకపోవడం ప్రజలకు గందరగోళాన్ని సృష్టిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ అప్పులను “మట్కా నంబర్ల” మాదిరిగా చూపిస్తూ అసత్యాలు ప్రస్తావిస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పడం పెద్ద నేరమని, కానీ ఈ ప్రభుత్వం బడ్జెట్‌లో కూడా నిజాలను చెప్పలేదని బుగ్గన హెచ్చరించారు. ఈ పరిస్థితిలో ఆయన “అనాలసిస్ ఆఫ్ బడ్జెట్” కాదు, “అనాలసిస్ ఆఫ్ అబద్ధాలు” చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి..

Exit mobile version