Site icon NTV Telugu

AP FiberNet Case: సీఎం చంద్రబాబుకు బిగ్‌ రిలీఫ్‌.. ఆ కేసు కొట్టివేసిన ఏసీబీ కోర్టు

Cm Chandrababu

Cm Chandrababu

AP FiberNet Case: విజయవాడలోని ఏసీబీ కోర్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట కలిగించే తీర్పు వెలువరించింది. చంద్రబాబుపై నమోదైన ఏపీ ఫైబర్ నెట్ కేసును పూర్తిగా కొట్టివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో, అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు అధికారులపై రూ.300 కోట్లకు పైగా టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసు విచారణలో భాగంగా 99 మంది సాక్షులను విచారించిన సీఐడీ, వారి వాంగ్మూలాలతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించింది. అయితే, విచారణలో ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ సంస్థ అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తూ, ప్రభుత్వానికి నష్టం లేదని, అందువల్ల కేసును ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనిపై తాజా ఎండీ గీతాంజలి కూడా కేసు ఉపసంహరణకు అభ్యంతరం లేదని అఫిడవిట్ సమర్పించారు.

Read Also: Khauf: OTTలో ఈ హర్రర్ సిరీస్‌ను చూశారా? వెన్నులో వణుకు పుట్టాల్సిందే..

అయితే, ఫైబర్ నెట్ సంస్థ అప్పటి చైర్మన్ గౌతం రెడ్డి, కేసును క్లోజ్ చేయవద్దంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన ఏసీబీ కోర్టు, గౌతం రెడ్డి పిటిషన్‌ను తిరస్కరిస్తూ, కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి, ఫైబర్ నెట్ కేసును పూర్తిగా కొట్టివేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పెద్ద ఊరట లభించగా, రాజకీయంగా కూడా ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

Exit mobile version