Deputy CM Pawan Kalyan: తొలి విమానం ల్యాండింగ్‌.. ఉత్తరాంధ్ర ప్రగతికి కొత్త అధ్యాయంగా అభివర్ణించిన పవన్

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సేవలు ప్రారంభం కావడం ఎంతో ఆనందదాయకమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం విజయవంతంగా ల్యాండ్ కావడం రాష్ట్ర ప్రగతి చరిత్రలో ఒక అద్భుత ఘట్టంగా అభివర్ణించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో పవన్ కల్యాణ్ ఇలా స్పందించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో నిర్మితమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం రవాణా సౌకర్యాల విస్తరణ మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఆకాంక్షలకు నిలువెత్తు రూపమని పేర్కొన్నారు.

భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ, కొత్త వేగం లభిస్తుందని పవన్ కల్యాణ్‌ అన్నారు. విమానాశ్రయం ద్వారా యువతకు మరిన్ని ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విస్తరించాలని ఆకాంక్షించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయం శాశ్వత మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి సేవలను అందిస్తూ విమానాశ్రయం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్..