డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో అమరావతి పరిధిలో డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై నిషేధం విధించారు. ఒకవేళ ఎగరవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Simhachalam Tragedy: ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం.. అధికారులను ప్రశ్నించనున్న కమిటీ
ప్రధాని మోడీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను మోడీ పున: ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సుమారు రూ.58 వేల కోట్ల అమరావతి ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనం, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా ఆలిండియా సర్వీసెస్ అధికారుల నివాస సముదాయానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్‌కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే విశాఖలో యూనిటీ మాల్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం రూ.3,680 కోట్ల నేషనల్ హైవే పనులు ప్రారంభించనున్నారు. కాజీపేట–విజయవాడ 3వ లైన్ ప్రారంభం కానుంది. గుంటూరు–గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా మోడీ ఈ ప్రారంభోత్సవం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Single : మంచు విష్ణు కు క్షమాపణలు చెప్పిన శ్రీ విష్ణు
ప్రధాని మోడీ శుక్రవారం ఏపీలో గంటా 25 నిమిషాల పాటు పర్యటించనున్నారు. మే 2న మధ్యాహ్నం 3:25కి రానున్నారు. ఇక సభా వేదికపై 14 మంది ఆసీనులు కానున్నారు. తొలుత మంత్రి నారాయణ ప్రసంగించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీచ్ ఇవ్వనున్నారు. చివరిగా ప్రధాని మోడీ ప్రసంగంతో సభ ముగియనుంది. ఇక ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఇక ప్రధాని సభకు రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల నేతలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది.
