Site icon NTV Telugu

AP Legislative Council: తొలిరోజే హాట్‌హాట్‌గా శాసన మండలి..

Atchannaidu Vs Botsa

Atchannaidu Vs Botsa

AP Legislative Council: ఏపీ శాసన సభ శాసన మండలి సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమ‌య్యాయి. శాసన సభ సమావేశాలను వైసీపీ ఈ సారి కూడా బాయ్ కాట్ చేసింది. అయితే శాసన మండలి లో మాత్రం వైసీపీ సభ్యులు ప్రజా సమస్యల పై చర్చకు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు.. మండలిలో మొదట రైతాంగ సమస్యలు, యూరియా కొరతపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు.. ఈ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో చైర్మన్ పోడియం దగ్గర వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. వైసీపీ ఆందోళనలతో శాసన మండలి 10 నిమిషాల పాటు వాయిదా పడింది.. వైసీపీ సభ్యుల ఆందోళనపై మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. యూరియా కొరత, వ్యవసాయ ఉత్పత్తులు, రైతుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.. వైసీపీ సభ్యులకే కాదు.. రాష్ట్ర ప్రజలకు వివరాలు తెలియజేసే బాధ్యత త‌మ ప్రభుత్వంపై ఉందన్నారు.. బీఎసీ సమావేశం అనంతరం సభలో చర్చ చేపట్టేందుకు సిద్దమని మంత్రి అచ్చెన్న తెలిపారు.

దీనిపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కౌంట‌ర్ ఇచ్చారు.. చర్చకు సిద్ధంగా ఉన్నప్పుడు ఇప్పుడే చర్చించవచ్చు కదా అని మంత్రి అచ్చెన్నాయుడుని ప్రశ్నించారు.. రైతులు బాగుండాలని మేము కోరుకుంటున్నాం.. రైతాంగం బాగుంటే అందరూ బాగుంటారు.. అందుకే రైతుల సమస్యలపై చర్చించాలని మేం కోరుతున్నామని డిమాండ్ చేశారు.. బొత్స వ్యాఖ్యలకు సమాధానమిచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు.. రైతులకు ఏ ప్రభుత్వం ఏం చేసిందనేది చర్చ జరగాలి.. బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుని చర్చిద్దాం.. సభ ద్వారా రైతులకు అన్నీ విషయాలు తెలియాలి.. రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం ఏం చేసిందో చెప్తాం.. రైతులను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుందనేది చెప్పటానికి మేం సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.. దీనికి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రైతుల తరపున చర్చించడానికి రేపటిదాకా ఎందుకు అని మంత్రిని అడిగారు. ఈ రోజే చర్చిస్తే తప్పేముంది.. గతంలో రైతులకు ఎలాంటి సమస్య ఎదురవ్వలేదు.. ఇప్పుడే సమస్య వచ్చింది కాబట్టే ఈరోజే చర్చించమని కోరుతున్నామన్నారు.

మరోవైపు తిరుమలలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జరుగుతున్న పరిణామాల పైనా వైసీపీ సభ్యులు గ‌ట్టిగానే ప్రశ్నించారు. తిరుపతి, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులు మరణించడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో సభ మరోసారి వాయిదా వేశారు చైర్మన్ మోషేన్ రాజు… సభ తిరిగి ప్రారంభం అయిన తర్వాత వైసీపీ విమర్శలకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమాధానమిచ్చారు.. ఇలాంటి ఘటనలకు కారణం రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కారణమని బురదజల్లుతున్నారనీ వైసీపీ సభ్యులపై మంత్రి ఫైర్ అయ్యారు.. బాధిత కుటుంబాలను వైసీపీ నేతల పరామర్శ ఓ దాడిలా జరిగిందనీ ఆరోపించారు.. పరామర్శ సమయంలో జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఆస్పత్రులపై దాడులుచేశారనీ మంత్రి ఆనం అన్నారు.. పరామర్శ అనే పదం వాడేందుకు వైసీపీ నేతలకు అర్హత ఉందా అని ప్రశ్నించారు.. రిమ్స్, బర్డ్ ఆస్పత్రుల వద్ద వైసీపీ వారు పోలీసులపై దాడులు చేశారని.. దాడులు, దౌర్జన్యాలు, ధ్వంసం చేయడం.. వైద్యులను మెడపట్టి గెంటడం.. ఇదా పరామర్శా అని నిలదీశారు.. మంత్రి సమాధానంపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.. ప్రభుత్వ తీరుకి శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు.

తిరుపతి, సింహాచలం ఘటనలతో ప్రభుత్వం, మంత్రికి సంబంధం లేదా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.. ఈ ప్రభుత్వానికి.. ప్రజలు.. దేవుడు అంటే లెక్కలేదని.. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.. అందుకే ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభను వాకౌట్ చేశామని చెప్పారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న మంత్రి ఆనం రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు బొత్స. ఇక, కరేడు భూసేకరణపై మండ‌లిలొ చ‌ర్చకు వ‌చ్చింది.. గత ప్రభుత్వ హయాంలో ఇండో సోల్ సోలార్ కు చేవూరులో ఏర్పాటు చేసుకుందుకు అనుమతులు ఇచ్చార‌ని.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ భూములనే బీపీసీఎల్ కు ఇచ్చారన్నారు.. మీరు వాళ్లకు భూములు ఇచ్చిన జీవోను కాన్సిల్ చేయకుండా బీపీసీఎల్ ఎందుకు ఇచ్చారు.. ఇండో సోల్ కంపెనీకి అక్కడ నుంచి కరేడు ఎందుకు తరలించారని ప్ర‌శ్నించారు.. కరేడు గ్రామస్తులు భూములు ఇచ్చేది లేదని గ్రామసభలో తీర్మానించుకున్నా ప్రభుత్వం బ‌ల‌వంత‌పు భూసేకరణ చేస్తుందని ఆరోపించారు.. దీనికి మంత్రి అనగాని సత్యప్రసాద్ స‌మాధాన‌మిచ్చారు.. గత ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రానికి వచ్చిన అనేక కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయని.. స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధి కోసం అనేక కంపెనీలకు రాయితీలు ఇచ్చి రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామ‌న్నారు.. క‌రేడు భూములకు పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఏపీఐఐసీకి ఇచ్చామ‌ని.. ఆ పరిశ్రమ వల్ల 30 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.. ప్రజా ప్రయోజనాలు తప్ప ప్రభుత్వం స్వార్థం ఏమీ లేదన్నారు.. ఆ ప్రాంతంలో నివసించే వారికి న్యాయం చేయటం కోసమే గ్రామసభలు పెట్టి భూసేకరణ చేశామ‌ని.. ప్రభుత్వం ఆ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంది.. అయితే వైసీపీ స‌భ్యుల ప్ర‌శ్న‌ల‌కు మంత్రి క్లారిటీగా స‌మాధానం ఇవ్వ‌క‌పోవ‌టంతో వివక్ష నేత బొత్స సత్యనారాయణ స్పంధించారు.. ప్రభుత్వం జీవో ఎందుకు ఇచ్చిందో క్లారిటీ ఇవ్వాలన్నారు.. భూసేకరణ చేస్తుంది ఐదు బ్లాకులా.. ఎనిమిది బ్లాకులా అనే క్లారిటీ ఇవ్వాలన్నారు.. దీని మీద చర్చకు అవకాశం ఇవ్వటంతో పాటు రెవిన్యూ మంత్రి క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.. దీంతో అన్ని స‌మాధానాలు ఒకేరోజు చ‌ర్చ‌లో రావాలంటే రావని అభ్యంతరం వ్యక్తం చేశారు మండలి చైర్మన్ మోషేన్ రాజు.. ఇప్పటికే ఎక్కువ సమయం కేటాయించామని అభ్యంతరం వ్యక్తం చేశారు..

రాష్ట్రంలో కల్తీ మద్యం, అక్రమ బెల్టు షాపుల పైనా మండలిలో చర్చ జరిగింది. ఇక యాభై ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల కు పెన్షన్ వంటి హామీల పైనా వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు.. దీనికి మంత్రి కొల్లు రవీంద్ర స‌మాధాన‌మిచ్చారు.. వైసీపీ సభ్యులు మద్యంపై మాట్లాడటం సిగ్గుచేటని.. లిక్కర్ స్కాంలో ఇంకా విచారణ జరుగుతుందన్నారు.. గత ప్రభుత్వం అనేక నాసిరకమైన బ్రాండ్లు తెచ్చిందని.. వాటిపై విచారణ జరుగుతుంది.. అన్నీ విషయాలు బయటకు వస్తాయన్నారు…. రోడ్ల మీద మద్యం సేవించకుండా ఉండేందుకే పర్మిట్ రూంలు తెచ్చామ‌ని.. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదన్నారు.. దీంతో వైసీపీ, టీడీపీ స‌భ్యులు అడిగిన ప‌లు ప్రశ్నల‌కు మంత్రులు స‌మాధానాలు ఇచ్చారు.. స‌భ నుంచి వైసీపీ స‌భ్యులు వాకౌట్ చేసి బ‌య‌ట‌కు వ‌చ్చిన అనంత‌రం కొంత‌సేపు స‌భ న‌డిచింది.. అనంత‌రం రేప‌టికి వాయిదా ప‌డ్డాయి..

Exit mobile version