AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక

  • ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు..
  • మరోవైపు 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం..
  • రాష్ట్ర ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక..
Thunderstorms

Thunderstorms

AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిడుగుల ప్రమాదం నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. APSDMA అంచనాల ప్రకారం అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.

వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు సంభవించే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర లేదా హోర్డింగ్స్ కింద నిలబడరాదని APSDMA హెచ్చరించింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపింది. అలాగే వర్షపు గాలుల కారణంగా ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించింది.

×
×
Ad

మరోవైపు ఎండల తీవ్రత కొనసాగింపు

వర్షాల సూచనలు ఉన్నప్పటికీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని APSDMA వెల్లడించింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

నేడు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో నేడు అత్యధికంగా అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 42.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 42.4 డిగ్రీలు, పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో 42.2 డిగ్రీలు నమోదయ్యాయి. అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 42 డిగ్రీలు, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, కాకినాడ జిల్లా పిఠాపురంలో 41.6 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మరియు విశాఖపట్నం జిల్లా అక్కిరెడ్డిపాలెంలో 41.5 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA వెల్లడించింది. వర్షాలు, పిడుగులు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకుని వాతావరణ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.