AP Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల పాటు భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఒకవైపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరోవైపు కొన్ని మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. కొమొరిన్ ప్రాంతం నుంచి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించినట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం వరకు మేఘావృత వాతావరణం కొనసాగనుంది. పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
శనివారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక, ఆదివారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వడగాలుల హెచ్చరిక
ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉండనుంది. శనివారం పోలవరం జిల్లాలోని కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే అల్లూరి, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పోలవరం పరిసర ప్రాంతాల్లోని 13 మండలాల్లో వడగాలుల ప్రభావం కనిపించే అవకాశం ఉందని తెలిపారు.
రాష్ట్రంలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు
శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కడప – 40.8°C
నంద్యాల జిల్లా పాణ్యం – 40.7°C
పోలవరం జిల్లా విఆర్ పురం – 40.6°C
పల్నాడు జిల్లా గురజాల – 40.5°C
కర్నూలు జిల్లా నగరడోన – 40.4°C
ఎన్టీఆర్ జిల్లా నందిగామ – 40.4°C
ఏలూరు జిల్లా కుక్కునూరు – 40.3°C
ప్రకాశం జిల్లా కొప్పెరపాడు – 40.2°C
నమోదైన వర్షపాతం
సాయంత్రం 5 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి:
నర్సీపట్నం – 16.2 మి.మీ
చిలకలూరిపేట, ఆకివీడు – 12 మి.మీ
ఉప్పుమాగులూరు – 10.5 మి.మీ
వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, పిడుగుల సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
