AP Weather: సమ్మర్‌ను తలపిస్తున్న ఏపీ వాతావరణం.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Ap Weather

Ap Weather

AP Weather: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం రెండో వేసవిని తలపిస్తోంది. అసాధారణ ఉష్ణోగ్రతలు, వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) నాలుగు జిల్లాలకు ఆరెంజ్ బులెటిన్, 21 జిల్లాలకు ఎల్లో బులెటిన్ జారీ చేసింది. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నేడు, రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కావలిలో 42 డిగ్రీలు, బాపట్లలో 41 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇదిలా ఉండగా, ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది వేసవిలో ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు దంచికొట్టాయి.. ఉక్కపోతతో జనాలు అల్లాడి పోయారు.. వర్షాలు ప్రారంభమైనా.. కొన్ని రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగాయి.. ఆ తర్వాత వర్షాలతో వాతావరణం కొంత వరకు చల్లబడినట్టు అనిపించినా.. ఇప్పుడు మళ్లీ ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు..