CM Chandrababu: ఉద్యానవన పంటల సాగుతో తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన కడప జిల్లా లింగాలం మండలం స్ఫూర్తితో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్ పురోగతికి హార్టికల్చర్ గ్రోత్ ఇంజిన్ అవుతుందని… 25కు పైగా ఉద్యాన ఉత్పత్తులు సాధించేలా చూడాలన్నారు. ఈ ప్రాంత స్థితిగతులు మార్చే శక్తి హార్టికల్చర్‌కు ఉందని.. తిరుపతి ఎకనామిక్ రీజియన్ మాస్టర్ ప్లాన్‌లో రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. పూర్వోదయ పథకం కింద రూ.40,000 కోట్లు, ప్రైవేట్ పెట్టుబడుల రూపంలో వచ్చే మరో రూ.60,000 కోట్లు ఉద్యానవన రంగానికి ఊతమిస్తాయని అధికారులకు సీఎం చెప్పారు. పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాల కన్నా.. సీమలోని ఓ మండలంలో ప్రజల తలసరి ఆదాయం అధికంగా ఉండటాన్ని అధ్యయనం చేయాలని సీఎం అన్నారు. కడప జిల్లా లింగాల మండలంలో ప్రజలు రూ. 7.30 లక్షలు తలసరి ఆదాయం కలిగి ఉండడం హార్టికల్చర్ పంటల సాగు వల్ల కలిగే లాభాలకు నిదర్శనమని సీఎం స్పష్టం చేశారు. హార్టికల్చర్ కు అత్యంత అనువైన రాయలసీమలో ఆ దిశగా ప్రజలను మరింత ప్రోత్సహించాలన్నారు. సీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను తీసుకువస్తే అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా మారుతాయని అన్నారు. ఆ దిశగా జిల్లా అధికారుల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు ప్రణాళికతో పనిచేయాలన్నారు..
రాష్ట్రంలోని మూడు ఎకనామిక్ రీజియన్లపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా 3 రీజియన్ల అభివృద్ధికి కార్యాచరణపై పలు మార్గదర్శకాలను సూచించారు. ఇప్పటికే విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రణాళిక ఆవిష్కరించగా… 6 నెలల్లో అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ల మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ సిద్ధమయ్యాక ముసాయిదాను ప్రజలు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంచి అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. రెండు నెలల్లో డిస్ట్రిక్ట్ ఎకనామిక్ ప్రొఫైల్ ను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల కలెక్టర్లు ఏ రంగాల్లో తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందో ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
స్పోర్ట్స్ సిటీల అభివృద్ధి..
అమరావతి, తిరుపతి, విశాఖలో అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపోందించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో మూడు ప్రాంతాల్లోనూ స్పోర్ట్స్ సిటీల అభివృద్ధి జరగాలన్నారు. ఏపీకి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతంలో సూర్య లంక సహా వివిధ ప్రాంతాల్లోని బీచ్ ఫ్రంట్ లను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. సూర్య లంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సీఎం నిర్దేశించారు. తీరప్రాంత పర్యాటకం, గ్లోబల్ బిజినెస్-ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్, గ్లోబల్ టాలెంట్-ఎలైట్ లివింగ్ అనే 3 పిల్లర్లపై ‘వైజాగ్ బే సిటీ’ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్‌లోని 51.88 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ‘వైజాగ్ బే సిటీ’ అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేలా ప్రముఖ సంస్థల్ని ఆహ్వానించాలన్నారు. బే సిటీలో 3,291 ఎకరాల ప్రభుత్వ భూమి లభ్యత ఉందని గుర్తించినట్టు ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అలాగే విశాఖ ఎకనామిక్ రీజియన్లో ఇప్పటికి మొత్తం 49 ప్రాజెక్టులు రాగా.. వీటిలో 18 ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయని, మరో 12 త్వరలో గ్రౌండ్ కానున్నాయని అధికారులు వివరించారు. మరో 19 ప్రాజెక్టులు ప్రణాళిక దశలో ఉన్నాయని చెప్పారు. అయితే వీటితో పాటు వచ్చే 3 నెలల్లో లక్ష చదరపు అడుగుల్లో ఇంటర్నేషనల్ కన్వెన్సన్ సెంటర్, హోటళ్లు, ఐటీ ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. అరకు-పాడేరు-విశాఖను పర్యాటక సర్కిల్‌గా రూపొందించి ప్రత్యేక ఆకర్షణ తీసుకురావాలన్నారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లతో విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి ఎంతో ఆస్కారం ఉందన్నారు. వెల్నెస్ సెంటర్లకు ప్రత్యేకంగా భూ కేటాయింపులు జరపాలన్నారు.
32 శాతం జనాభా అమరావతిలోనే..
రాష్ట్ర జనాభాలో 32 శాతం అమరావతి ఎకనామిక్ రీజియన్‌లో నివసిస్తున్నారని… భౌగోళికంగా 33 శాతం విస్తరించి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో ఉండటం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉండటం ఏఈఆర్‌కు కలిసొచ్చే అంశమని అన్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం.. మొత్తం 9 జిల్లాలు అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో ఉండగా… వీటిలో అన్నింటికన్నా కృష్ణా జిల్లా తలసరి ఆదాయంలో ముందుందని అధికారులు చెప్పారు. జిల్లాల వారీగా రీజియన్ అభివృద్ధి జరిగేలా వర్క్ షాపులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆక్వా, పామాయిల్, కోకో ఉత్పత్తులతో పాటు…కొల్లేరు సరస్సును రీజియన్ అభివృద్ధి కోసం వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు.
ఖనిజ సంపద నుంచి హార్టికల్చర్ వరకు.. ఫుణ్యక్షేత్రాల నుంచి పర్యాటక ప్రాంతాల వరకు రాయలసీమకు ఉన్న అనుకూలతను మార్కెటింగ్ చేసుకోవాలని సీఎం అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పనిచేస్తే పెద్దఎత్తున పెట్టుబడులు… తద్వారా యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. విశాఖ, అమరావతి రీజియన్లతో పోటీ పడేలా తిరుపతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి జరగాలన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

