APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు

Stree Shakti Scheme

Stree Shakti Scheme

APSRTC: ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ ఉచిత ప్రయాణ పథకం చారిత్రాత్మక మైలురాయిని దాటింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. రాష్ట్రంలోని మహిళల నుంచి ‘స్త్రీ శక్తి’ పథకానికి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపింది. ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా మహిళలకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం కలుగుతోందని ఏపీఎస్ఆర్టీసీ పేర్కొంది. ఉచిత ప్రయాణాల ద్వారా ఇప్పటివరకు మహిళలకు సుమారు రూ.3,500 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలిగినట్లు వెల్లడించింది. ప్రయాణ ఖర్చుల భారం తగ్గడంతో మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపింది.

ప్రతిరోజూ సగటున 24 లక్షల మంది మహిళలు ‘స్త్రీ శక్తి’ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు, ఉద్యోగాలు, విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం ప్రయాణించే మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా మారిందని పేర్కొంది. ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా మహిళలకు అండగా నిలుస్తున్న ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందిని సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు అభినందించారు. పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రశంసించారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ప్రజా రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో ‘స్త్రీ శక్తి’ పథకం కీలకంగా మారిందని ఏపీఎస్ఆర్టీసీ పేర్కొంది. 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు పూర్తవడం పథకానికి మహిళల నుంచి లభిస్తున్న ఆదరణకు నిదర్శనమని తెలిపింది.