School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు

Ap School Academic Calendar

Ap School Academic Calendar

School Holidays: వచ్చే 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను సిద్ధం చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలకు మొత్తం 87 రోజుల సెలవులు ఉండనున్నాయి. అదనంగా ఐదు ఐచ్ఛిక సెలవులు, స్థానిక పండుగలు మరియు జాతరల కోసం మూడు స్థానిక సెలవులు కూడా ఇవ్వనున్నారు. విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు పాఠశాలలు పని చేయనున్నాయి. ఈ క్యాలెండర్ రూపకల్పనకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి వారి సూచనలు, సలహాలను విద్యాశాఖ స్వీకరించింది. ఉపాధ్యాయుల పని భారం సమతుల్యం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది.

Read Also: Heinrich Klaasen: ఇకపై నాకు ఆడాలనే ఆసక్తి లేదు.. హెన్రిచ్ క్లాసెన్ సంచలన వ్యాఖ్యలు!

ప్రతి ఉపాధ్యాయుడు వారానికి కనీసం 24 బోధనా పీరియడ్లు నిర్వహించాలి, గరిష్ఠంగా 30 పీరియడ్లు మించకూడదని విద్యాశాఖ స్పష్టం చేసింది. అవసరమైతే భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు గణితం కూడా బోధించేలా మార్పులు చేపట్టనున్నారు. ఇక, జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభం కాగానే విద్యార్థుల ప్రవేశాలకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. అలాగే ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’గా నిర్వహించి, విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

విద్యార్థులను కొత్త తరగతులకు సిద్ధం చేయడానికి తరగతి సంసిద్ధత కార్యక్రమాలను అమలు చేస్తారు. 1, 2, 6 తరగతులకు జూన్ 12 నుంచి ఆగస్టు 3 వరకు 36 రోజులపాటు, 3, 4, 5, 7, 8 తరగతులకు జూన్ 12 నుంచి 30 వరకు 13 రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెలవుల విషయానికి వస్తే, సాధారణ పాఠశాలలకు అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఉంటాయి. మైనారిటీ పాఠశాలలకు అక్టోబర్ 15 నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. క్రిస్మస్ సందర్భంగా మైనారిటీ విద్యాసంస్థలకు డిసెంబర్ 20 నుంచి 27 వరకు సెలవులు ఉండగా, సాధారణ పాఠశాలలకు డిసెంబర్ 25న ఒకరోజు మాత్రమే సెలవు ఉంటుంది. సంక్రాంతి సెలవులు 2027 జనవరి 11 నుంచి 17 వరకు ఉంటాయి.

ఇక, పరీక్షల షెడ్యూల్ విషయానికి వస్తే.. ఫార్మేటివ్-1 పరీక్షలు ఆగస్టు 3 నుంచి 6 వరకు, ఫార్మేటివ్-2 అక్టోబర్ 5 నుంచి 8 వరకు నిర్వహిస్తారు. సమ్మెటివ్ పరీక్షలు నవంబర్ 9 నుంచి 20 వరకు జరగనున్నాయి. ఫార్మేటివ్-3 జనవరి 4 నుంచి 7 వరకు, ఫార్మేటివ్-4 ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు నిర్వహిస్తారు. పదో తరగతి విద్యార్థులకు ప్రీ-ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు, గ్రాండ్ టెస్ట్ మరియు తొమ్మిదో తరగతి సమ్మెటివ్-2 పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9 వరకు జరుగుతాయి. 1 నుంచి 8 తరగతుల సమ్మెటివ్-2 పరీక్షలు 2027 ఏప్రిల్ 3 నుంచి 17 వరకు నిర్వహిస్తారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 15 నుంచి 31 వరకు జరుగనున్నాయి. ఈ అకడమిక్ క్యాలెండర్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు స్పష్టమైన ప్రణాళిక లభించడంతో పాటు, విద్యా వ్యవస్థ మరింత క్రమబద్ధంగా సాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.