Site icon NTV Telugu

AP Panchayat Raj Wins National Awards 2026: ఏపీ పంచాయతీరాజ్‌ శాఖకు జాతీయ అవార్డులు.. పవన్‌ కల్యాణ్‌ హర్షం..

Ap Panchayat Raj Wins Natio

Ap Panchayat Raj Wins Natio

AP Panchayat Raj Wins National Awards 2026: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మరోసారి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచింది. వరుసగా రెండో ఏడాది దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ జాతీయ పురస్కారాలకు ఎంపిక కావడం రాష్ట్రానికి గర్వకారణమని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆనందం వ్యక్తం చేశారు.. ఈ విజయాలు గ్రామీణాభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించిన పంచాయతీగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని బొక్కసం పాలెం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకోవడం విశేషమని పవన్ అన్నారు. అదేవిధంగా సుపరిపాలన విభాగంలో విశాఖపట్నం జిల్లా శృంగవరం గ్రామ పంచాయతీ మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమని తెలిపారు.

గ్రామ స్థాయిలో పేదరిక నిర్మూలన, జీవనోపాధి మెరుగుదల అంశాల్లో వైఎస్ఆర్ కడప జిల్లా చెమ్ముళ్లపల్లి గ్రామం జాతీయ స్థాయిలో రెండో స్థానం సాధించగా, మౌలిక సదుపాయాల కల్పనలో స్వయం సమృద్ధి సాధించిన పంచాయతీల్లో ప్రకాశం జిల్లా గుండమల గ్రామ పంచాయతీ మూడో స్థానంలో నిలిచింది. ఇక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ పరిధిలోని కుప్పం మండలం జాతీయ స్థాయిలో మూడో అత్యుత్తమ మండలంగా ఎంపిక కావడం ప్రత్యేకంగా నిలిచింది. గత ఏడాది కూడా పంచాయతీరాజ్ శాఖ వివిధ విభాగాల్లో నాలుగు అవార్డులు గెలుచుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఈ విజయాలకు కారణమైన గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు అందరికీ పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గ్రామీణాభివృద్ధికి తమ కృషిని గుర్తించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అవార్డులు తమపై మరింత బాధ్యతను మోపాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌…

Exit mobile version