AP Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Ap Panchayat Elections 2026

Ap Panchayat Elections 2026

AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రెండో విడతలో మొత్తం 4,960 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇందులో 4,960 మంది సర్పంచులు, 49,224 మంది వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

రెండో విడత ఎన్నికలకు ఎల్లుండి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్లపై అభ్యంతరాలు, అప్పీళ్ల దాఖలుకు ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. 23వ తేదీన అప్పీళ్లను పరిష్కరించనున్నారు. అనంతరం ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. ఇక, రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. అవసరమైన ప్రాంతాల్లో ఈ నెల 30వ తేదీన రీపోలింగ్ నిర్వహించి, అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు.