AP Panchayat Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసి.. పెండింగ్లో ఉన్న మున్సిపల్ ఎన్నికలకు కూడా జరుగుతుండగా.. మరోవైపు.. పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
తొలి విడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 18న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ నెల 26వ తేదీన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటించనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో ఈ నెల 27వ తేదీన రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇక, మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు సిద్ధమవుతున్నారు.

