Site icon NTV Telugu

AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కోర్టుకు చేరిన FSL రిపోర్ట్..

Ap Liquor Scam Case

Ap Liquor Scam Case

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితుల మొబైల్ ఫోన్లకు సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ (FSL) నివేదిక కోర్టుకు చేరింది.. ఫోన్లలోని డేటా, కాల్ రికార్డులు, డిలీట్ చేసిన ఫైల్స్, ఇతర డిజిటల్ ఆధారాలపై ఫోరెన్సిక్ విశ్లేషణ పూర్తి చేసి నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు.. కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కోర్టు నుంచి ఈ FSL రిపోర్టును రేపు అధికారికంగా తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కోర్టు అనుమతితో SIT బృందం నివేదిక కాపీని స్వీకరించి, అందులోని కీలక అంశాల ఆధారంగా తదుపరి విచారణను వేగవంతం చేయనుంది.

Read Also: Cyberabad Police : మీ పిల్లలకి కావాల్సింది ర్యాంకులు కాదు.. మీ తోడు.!

అయితే, లిక్కర్ స్కాం బయటపడిన వెంటనే నిందితులు తమ మొబైల్ ఫోన్లను ధ్వంసం (destroy) చేసినట్లు ఇప్పటికే సిట్‌ గుర్తించింది. అయితే, FSL నిపుణులు అధునాతన టెక్నాలజీతో ఫోన్లలోని చిప్స్‌, స్టోరేజ్ భాగాల నుంచి డేటాను రికవరీ చేసి విశ్లేషణ చేసినట్లు సమాచారం. దీంతో, స్కామ్‌లో జరిగిన కమ్యూనికేషన్‌, లావాదేవీల డిజిటల్ ఆధారాలు బయటపడే అవకాశం మరింత పెరిగింది. FSL రిపోర్ట్‌ SIT చేతికి అందితే.. స్కాం వెనక ఉన్న నెట్‌వర్క్‌, నిందితుల మధ్య జరిగిన చాట్స్‌, కాల్స్‌, డిలీట్ చేసిన డాక్యుమెంట్లు, డిజిటల్ లావాదేవీల వివరాలు, కీలక వ్యక్తుల పాత్ర వంటి అంశాలు బయటపడే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ ఆధారాలు కేసు దర్యాప్తులో గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశముందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోర్టు నుంచి FSL రిపోర్టును రేపు SIT బృందం తీసుకోనుండటంతో, దర్యాప్తు మరింత కీలక దశకు చేరింది. నివేదికలోని వివరాల ఆధారంగా సిట్‌ కొత్త నోటీసులు, విచారణలు, అవసరమైతే అదనపు అరెస్టులపై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది.

Exit mobile version