Site icon NTV Telugu

Minister BC Janardhan Reddy: ఏపీలో కొత్తగా 6 విమానాశ్రయాలు..!

Minister Bc Janardhan Reddy

Minister Bc Janardhan Reddy

Minister BC Janardhan Reddy: భోగాపురం ఎయిర్‌పోర్టు గడువు కంటే ముందే పూర్తి చేయబోతున్నాం… ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 6 విమానాశ్రయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు రోడ్లు–భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల పరిస్థితి దారుణంగా మారడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీసీ జనార్ధన్ రెడ్డి విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో రోడ్ల సంరక్షణ, మరమ్మతులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం ప్రభుత్వం భారీ ఆర్థిక భారం మోస్తోందని ఆయన తెలిపారు.

Read Also: BCCI Deadline: గంభీర్‌కు డెడ్ లైన్ ప్రకటించిన బీసీసీఐ !

అయితే, రహదారుల పునర్నిర్మాణానికి భారీ వ్యయం అవుతుందని వెల్లడించారు బీసీ జనార్ధన్‌ రెడ్డి.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోడ్ల మరమ్మతులకు అదనంగా రూ.20,000 కోట్ల భారం పడిందన్న ఆయన.. మొత్తం 15,000 కిలో మీటర్ల మేర రహదారులు పూర్తిగా పనికిరానంతగా దెబ్బతిన్నాయి. మొత్తం 30,000 కిలో మీటర్లు రోడ్లు సరైన సంరక్షణ లేక పాడైపోయాయన్నారు.. అయితే, దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు ఇప్పటివరకు రూ.3,000 కోట్ల నిధులు వెచ్చించినట్టు పేర్కొన్నారు.. 22,000 కిలో మీటర్ల గుంతల రోడ్లను రూ.1,061 కోట్ల వ్యయంతో పునరుద్ధరించారు. పీపీపీ మోడల్‌లో 175 రహదారులను 5,130 కిలో మీటర్ల పొడవు వరకు అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు..

జగన్ పాలనలో ఆగిపోయిన పలు ప్రాజెక్టులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు బీసీ జనార్ధన్‌ రెడ్డి.. అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే, అమరావతి రింగ్ రోడ్, ఇతర ప్రాధాన్యత ప్రాజెక్టులు ఉన్నాయన్నారు.. ఇక, మొంథా తుఫాన్ ప్రభావంతో 4,794 కిలో మీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి.. రూ.2,774 కోట్ల నష్టం సంభవించిందని తెలిపారు.. రహదారుల నిర్మాణ నాణ్యత కోసం డ్యానిష్ ఫైబర్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రూ.15,000 కోట్ల వ్యయంతో మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల నిర్మాణం జరుగుతోంది. వచ్చే ఏడాదికి పూర్తిచేస్తాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం గడువు ముందుగానే పూర్తి చేస్తామని.. రాష్ట్రంలో కొత్తగా 6 విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని.. రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధిలో ఇది భారీ మలుపు అని తెలిపారు రోడ్లు–భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి.

Exit mobile version