AP Government: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీల విభజన, విలీన ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగియకముందే విలీన ప్రతిపాదనలపై కీలక సవరణలు తీసుకురావాల్సిన పరిస్థితి.. కానీ, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు, అలాగే రాబోయే జనగణన ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది..
Read Also: Bengaluru: కొత్త జంట షాకింగ్ నిర్ణయం.. వెయ్యి కి.మీ ప్రయాణం చేసి ఏం చేశారంటే..!
అయితే, పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఇంకా కొనసాగుతుండటం వల్ల మధ్యలో విలీనాలు చేపట్టడం సరైంది కాదన్న అభిప్రాయం.. గ్రామాల విభజన, విలీనంపై కోర్టుల్లో పెండింగ్ కేసులు ఉండటం.. త్వరలో చేపట్టనున్న జాతీయ జనగణన కారణంగా గ్రామాల జనాభా, సరిహద్దులు, భౌగోళిక వర్గీకరణలో మార్పులు వచ్చే అవకాశం ఉండటం కూడా ఈ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోవడానికి కారణంగా చెబుతున్నారు.. పలు పరిపాలనా, చట్టపరమైన సవరణలు పరిశీలనలో ఉండటం.. ఈ అన్ని అంశాలను సమీక్షించిన తర్వాతే.. విభజన లేదా విలీన ప్రక్రియను కొంతకాలం నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలు విభజన లేదా విలీనానికి సంబంధించి తీర్మానాలు కూడా ఆమోదించాయి. ఆయా తీర్మానాలను జిల్లా కలెక్టర్ ఆమోదంతో పంచాయతీ కమిషనర్ కార్యాలయానికి పంపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే.. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఫైళ్లను తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. రెండు రోజుల్లో గ్రామ పంచాయతీల విభజన/విలీన ప్రక్రియ వాయిదాకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు, పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. విభజన, విలీన ప్రక్రియపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే గ్రామీణ పరిపాలనలో మార్పులు, సిఫార్సుల అమలు, చట్టపరమైన సవరణలపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది..
