AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్

Ap Dsc

Ap Dsc

AP DSC Recruitment: డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలు, సందేహాలపై విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మరోసారి వివరణ ఇచ్చారు. డీఎస్సీ ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి తప్పిదాలు జరగలేదని స్పష్టం చేసిన ఆయన, అభ్యర్థుల్లో నెలకొన్న కొన్ని అపోహలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అక్టోబర్‌లో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాదిలోనే మరో డీఎస్సీ నిర్వహించనున్నట్లు కోన శశిధర్ వెల్లడించారు. ప్రస్తుత నియామకాల్లో అవకాశం దక్కని అభ్యర్థులకు మరో అవకాశం లభిస్తుందని తెలిపారు.

సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరైన ప్రతి అభ్యర్థికి ఉద్యోగం వస్తుందని హామీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కాల్ లెటర్లలో కూడా స్పష్టంగా పేర్కొన్నామని చెప్పారు. రూల్స్ ప్రకారం నవీన్ అనే అభ్యర్థి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరు కాలేదని వివరించారు కోన శశిధర్‌. హారిజాంటల్ రిజర్వేషన్ల విషయంలో కొంతమంది అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారని, ఈ ప్రక్రియ డైనమిక్‌గా ఉంటుందని కోన శశిధర్ పేర్కొన్నారు. దీనిపై పూర్తి అవగాహన కోసం లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది అభ్యర్థులు నేరుగా వచ్చి వివరాలు తెలుసుకుని వెళ్లారని తెలిపారు.

×
×
Ad

డీఎస్సీ ఫలితాల విషయంలో ఎక్కడా రిజెక్షన్ లిస్ట్ విడుదల చేయలేదని, కేవలం సెలక్షన్ లిస్ట్ మాత్రమే ప్రకటించామని స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థి లాగిన్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచినప్పుడు ఇంకా అనుమానాలకు తావు లేదన్నారు. సెలెక్ట్ కాలేకపోయిన అభ్యర్థుల్లో నిరాశ ఉండటం సహజమని, వారి భావోద్వేగాలను అర్థం చేసుకుంటున్నామని కోన శశిధర్ అన్నారు. అయితే ఎంపికైన అభ్యర్థులందరూ పూర్తిగా తమ ప్రతిభ, మెరిట్ ఆధారంగానే ఎంపికయ్యారని స్పష్టం చేశారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరిన సీబీఐ విచారణ అంశంపై స్పందించిన కోన శశిధర్, అధికారులుగా తమ బాధ్యత వాస్తవాలను ప్రజలకు తెలియజేయడమేనని చెప్పారు. డీఎస్సీ నియామకాల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని మరోసారి స్పష్టం చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్ల కారణంగా కొంతమంది అభ్యర్థుల్లో అసంతృప్తి ఉండొచ్చని, అయితే నియామకాల ప్రక్రియ పూర్తిగా నిబంధనల మేరకే జరిగిందని తెలిపారు.