Father Name Not Mandatory: ఇక తండ్రి పేరు తప్పనిసరి కాదు.. బాలల హక్కుల కమిషన్ కీలక నిర్ణయం.. వారికి ఊరట..

Father Name Not Mandatory

Father Name Not Mandatory

Father Name Not Mandatory: సింగిల్ పేరెంట్ పిల్లలు, అనాథలు, తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలకు ఊరట కలిగించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.. పిల్లల విద్య, వైద్యం, ఇతర ప్రభుత్వ సేవలకు సంబంధించిన దరఖాస్తుల్లో తండ్రి పేరును తప్పనిసరి చేయకుండా ఐచ్ఛికంగా ఉంచాలని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నిర్ణయించింది. తండ్రి పేరు లేకున్నా పిల్లలకు విద్య, వైద్యం, ఇతర ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నిర్ణయంతో సింగిల్ పేరెంట్ పిల్లలు, అనాథలు, తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలకు ఊరట లభించనుంది.

పిల్లల గౌరవం, గోప్యతకు ప్రాధాన్యం
పాఠశాలలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ దరఖాస్తుల సమయంలో తండ్రి పేరు తప్పనిసరిగా అడగడం వల్ల కొందరు పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిషన్ గుర్తించింది. ముఖ్యంగా సింగిల్ పేరెంట్ కుటుంబాలు, అనాథలు, తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. తండ్రి పేరు వెల్లడించకూడదనుకునే కుటుంబాల హక్కులను గౌరవించాలని సూచించింది. పిల్లల గౌరవం, గోప్యత, సమానత్వ హక్కులను కాపాడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.

నవంబర్ 10న విజయవాడలో అవగాహన కార్యక్రమం
తండ్రి పేరును ఐచ్ఛికంగా మార్చే అంశంపై ప్రజల్లో, విద్యాసంస్థల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమానికి కమిషన్ శ్రీకారం చుట్టింది. ‘తండ్రి పేరును ఐచ్ఛికం చేయడం’ అనే అంశంపై నవంబర్ 10న విజయవాడలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, హెల్ప్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తండ్రి పేరు తప్పనిసరి నిబంధన వల్ల ఎదురవుతున్న సమస్యలు, పిల్లల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ సేవలు అందరికీ సమానంగా చేరేలా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించనున్నారు.