ఓవైపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026-27ను రూపొందించే పనిలో పడిపోయింది.. ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అసెంబ్లీ వర్గాలకు సమాచారం అందించింది. నాలుగు వారాల పాటు, అంటే మార్చి 12వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 10 గంటలకు గవర్నర్ రాష్ట్ర శాసనసభ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 12న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ్యులు ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజంతా ఈ తీర్మానంపై చర్చ సాగనుంది.
Read Also: Silver Prices: తెల్లబంగారమా? వెండి గండమా? మూడు రోజుల్లో రూ.48 వేలు పెరిగిన వెండి..
ఇక, ఫిబ్రవరి 13వ తేదీన ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెం నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే, బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాలపై విస్తృత చర్చ జరగనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
