Rains: తెలుగు రాష్ట్రాలను ఇప్పట్లో వర్షాలు వదిలేలా లేవు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఈ క్రమంలోనే వాతావరణశాఖ మరో కీలక హెచ్చరికలు చేసింది. బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడుతుందని.. దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో మరో నాలుగు రోరజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోనూ అక్కడక్కడ ఓ మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా రేపటి వరకు వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ సూచనలు చేసింది.
మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను పునరావాసకేంద్రాలకు తరలించారు. దాంతో ప్రకాశం బ్యారేజి దగ్గర వరద ప్రవాహం భారీగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతి కాస్త తగ్గింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు అధికారులు. బ్యారేజీ వద్ద 11.70 అడుగులకు గోదావరి వరద నీటిమట్టం తగ్గింది. బ్యారేజ్ కి సంబంధించిన 175 గేట్లు ఎత్తివేసి 9 లక్షల 70 వేల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేసారు.
అయితే, తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కురుస్తున్న వానలకు అన్నదాతకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. చేతికొచ్చిన పంటలు నీట మునగడంతో ఆందోళన చెందుతున్నారు. వేల పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తుంటే నిత్యం కురుస్తున్న వర్షాలతో పొలాలు నీట మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న, వరి లాంటి ప్రధాన పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు.. పొలంలో ఇసుకమేటలు ఏర్పడ్డాయి. కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు ఆరు లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పులిచింతల ప్రాజెక్టు నిండింది. వరద ఎక్కువగా ఉండడంతో ప్రాజెక్టు నుంచి 16 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. వరదప్రవాహం భారీగా ఉండడంతో కృష్ణాతీర ప్రాంతంలోని పలు ప్రాంతాలు ముంపుకు గురయయాయి. దాచేపల్లి మండలం రామాపురంలో మత్స్యకారుల కాలనీ పూర్తిగా నీటమునిగింది. రామాపురంలో పంటపొలాలు ముంపుకు గురయ్యాయి. అచ్చంపేట మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి..
అమరావతి మండలం పెదమద్దూరులో వందల ఎకరాల పంట నీట మునిగింది. పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దాంతో ఆయా ప్రాంతాలలో, మిర్చి, పత్తి, మినుము, కంది లాంటి పంట పొలాల్లోకి నీరు చేరడంతో పంటలు పూర్తిగా నాశనం అయ్యాయి. ఇటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలకు పంటలు పూర్తిగా నీట మునిగాయి. కొన్ని చోట్ల వరద ప్రవాహంతో నేలకొరిగాయి. మరికొన్ని చోట్ల పంటలు వాగులు, వరదల్లో కొట్టుకుపోయాయి. చేతికొచ్చిన పంట నాశనం అవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
