AP COVID-19 Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువ స్థాయిలోనే ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ -19 వ్యాప్తి అదుపులోనే ఉందని తెలిపింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు దేశంలో 2,554 కరోనా కేసులు నమోదుకాగా, ఏపీలో 74 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 74 కేసులతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 8వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ సమూహాలుగా (క్లస్టర్లుగా) వ్యాప్తి చెందుతున్న దాఖలాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడక్కడా మాత్రమే కేసులు నమోదవుతున్నాయని, వైరస్ వ్యాప్తి పెరుగుతున్న సూచనలు కనిపించడం లేదని తెలిపారు. గత 28 రోజుల్లో రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించారు.
74 కేసుల్లో 56 మంది కోలుకున్నారు
ఆగస్టు 16 నాటికి రాష్ట్రంలోని 17 జిల్లాల్లో మొత్తం 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 74 మంది కరోనా బాధితుల్లో 56 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం మరో 10 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు నలుగురు కరోనా కారణంగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
దేశంలో కేరళ టాప్.. ఏపీకి 8వ స్థానం
ఈ ఏడాది దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో కేరళ 780 కేసులతో మొదటి స్థానంలో ఉంది. తమిళనాడు 372, పశ్చిమ బెంగాల్ 261, కర్ణాటక 247, ఢిల్లీ 227, మహారాష్ట్ర 169, మిజోరం 126 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 74 కేసులతో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అవసరమైన వైద్య సామగ్రిని సిద్ధంగా ఉంచింది. 1,233 వైరస్ నమూనాల రవాణా మాధ్యమాలు (వైరస్ ట్రాన్స్‌ఫర్ మీడియం), 6,960 వేగవంతమైన పరీక్షా కిట్లు, 22,535 ఎన్95 మాస్కులు, 47,018 వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ కిట్లు), 15.31 లక్షల శస్త్రచికిత్స మాస్కులు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
మందుల విషయానికి వస్తే 850 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, 13.81 లక్షల అజిత్రోమైసిన్ మాత్రలు, 65.32 లక్షల విటమిన్-సి మాత్రలు, 1.54 కోట్ల పారాసిటామాల్ మాత్రలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. మొత్తంగా 31 రకాల అవసరమైన మందులు, సుమారు రూ.9.53 కోట్ల విలువైన ఔషధ నిల్వలు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తక్కువ స్థాయిలోనే ఉందని, క్లస్టర్ వ్యాప్తి లేదని అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన వైద్య సామగ్రి, మందులను సిద్ధంగా ఉంచామని తెలిపారు.

