Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!

Amaravati Land Pooling Case

Amaravati Land Pooling Case

Amaravati Land Pooling Case: అమరావతి ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి పి. నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వీరిద్దరిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. చంద్రబాబు, పి. నారాయణపై 2021లో నమోదైన క్రిమినల్ కేసును జూలై 15న ఏపీ హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. 2021 మార్చి 12న ఏపీ సీఐడీ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అయితే ప్రభుత్వ విధాన నిర్ణయాలు తీసుకోవడం, వాటికి సంబంధించి జీవోలు జారీ చేయడాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని క్రిమినల్ కుట్రగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టులో ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునే కారణాలు కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇక, అమరావతి ల్యాండ్ పూలింగ్ వ్యవహారానికి సంబంధించిన ఈ తీర్పు ఇతర కేసులపై ప్రభావం చూపదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయా కేసులను వాటి స్వంత మెరిట్స్ ఆధారంగా నిర్ణయించాలని పేర్కొంది. దీంతో ఇతర కేసుల్లోని అంశాలను ఈ తీర్పుతో ముడిపెట్టకూడదని ధర్మాసనం స్పష్టం చేసినట్లయింది.

రాజకీయ పోరాటాలను కోర్టులో చేయొద్దు
విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల ప్రయోజనాల విషయంలో న్యాయస్థానం అవసరమైన రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేశారు. అయితే రాజకీయ పోరాటాలను కోర్టుల వేదికగా చేయకూడదని వ్యాఖ్యానించారు. రైతుల హక్కులు, ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయని, అయితే రాజకీయ వివాదాలను న్యాయపరమైన పోరాటాలుగా మార్చడం సరికాదని సూచించారు.