Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్

Amaravati

Amaravati

Amaravati – Krishna River: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కృష్ణా నది వరద ముప్పును తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా నది కరకట్ట పటిష్టీకరణ, వరద నివారణ పనులకు రూ.443.26 కోట్ల సవరించిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనులను అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (ADC) ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. కరకట్ట పటిష్టీకరణ పనులను మొత్తం మూడు ప్యాకేజీలుగా విభజించి అధికారులు అమలు చేయనున్నారు. కృష్ణా నది వరదల సమయంలో ముంపు ముప్పును తగ్గించేలా కరకట్టను మరింత బలోపేతం చేయడమే ఈ పనుల ప్రధాన ఉద్దేశం.

కరకట్ట బలోపేతానికి సంబంధించిన పనులపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైన నిధుల విడుదలకు ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. అలాగే, మంజూరైన నిధులను వినియోగించే సమయంలో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ADCకి ప్రభుత్వం సూచించింది. తాజా నిర్ణయంతో అమరావతిలో కృష్ణా నది వరదల ప్రభావాన్ని తగ్గించేందుకు కరకట్ట పటిష్టీకరణ పనులు ముందుకు సాగనున్నాయి.

కాగా, ప్రకాశం బ్యారేజీ నుండి వైకుంఠపురం వరకు కృష్ణానది కరకట్ట సుమారు 22 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న విషయం విదితమే.. ఇది విజయవాడతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కృష్ణానది వరదల నుండి రక్షించే ముఖ్యమైన ఉద్దేశంతో వరద కట్టగా నిర్మించారు.. భారీ వరదలతో పాటు.. ఇసుక రవాణా కారణంగా కరకట్టకు ఏర్పడే ముప్పును నివారించడానికి, ప్రభుత్వం ఎప్పటికప్పుడు కరకట్ట పటిష్టత, ఎత్తు పెంపు మరియు విస్తరణ పనులకు చర్యలు చేపడుతూనే ఉంది.. ఇదే సమయంలో రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్న సమయంలో.. రాజధానికి కృష్ణా నది నుంచి ఎలాంటి ముప్పు లేకుండా చర్యలకు పూనుకుంటుంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం..