Amaravati Flood: మురసు తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వరద నివారణ చర్యలపై అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) ప్రత్యేక దృష్టి సారించింది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రాజధాని పరిధిలోని వాగుల్లో వరద నీటి ప్రవాహాన్ని ఏడీసీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఏడీసీ సీఎండీ డి. లక్ష్మీపార్థసారథి స్వయంగా పలు ప్రాంతాలను సందర్శించి వరద పరిస్థితిని సమీక్షించారు.
కొండవీటివాగు, పాలవాగు, పేరమ్మవాగు, కొటేళ్లవాగుల్లో నీటి ప్రవాహం, వరద నీటి మళ్లింపు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద నీటి ప్రవాహానికి ఎక్కడా ఆటంకాలు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లాం, పెద్దపరిమి ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు నీరుకొండ రిజర్వాయర్ డైవర్షన్ ఛానల్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా వెళ్లేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఉండవల్లి వద్ద రోజుకు 180 క్యూసెక్కుల వరద నీటిని పంపింగ్ స్టేషన్ ఎస్కేప్‌ల ద్వారా కృష్ణానదిలోకి తరలించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పెనుమాక రిజర్వాయర్‌కు చేరుకునే వరద నీటిని కూడా కృష్ణానదిలోకి మళ్లించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
వెస్ట్ బైపాస్ వద్ద కొండవీటివాగు ప్రవాహంపై ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే ఎన్-10, ఎన్-11 రోడ్ల వద్ద వర్షపు నీరు నిలిచిపోకుండా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారులపై నీరు నిలిచిపోవడం, వరద ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మురసు తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు రాజధాని పరిధిలోని వాగులు, రిజర్వాయర్లు, వరద నీటి మళ్లింపు మార్గాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఏడీసీ సీఎండీ అధికారులను ఆదేశించారు. వరద ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

