Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!

Minister Narayana

Minister Narayana

Amaravati Flood Control System: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో కూటమి ప్రభుత్వం.. ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మధ్య విమర్శల పర్వం కొనసాగింది.. వర్షం పడిందంటే.. కృష్ణానదిలో వరద పెరిగిందంటే.. అమరావతిపైనే చర్చ సాగుతుంది.. అయితే, అమరావతి రాజధాని అత్యంత సురక్షితమైన నగరమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.. రాజధాని నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత వర్షపు నీరు నిలిచే సమస్య ఎక్కడా ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లోని ట్రెంచ్‌లలో వర్షపు నీరు కనిపిస్తోందని తెలిపారు.

అమరావతిలో వరద నియంత్రణ వ్యవస్థను ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఇందుకోసం నెదర్లాండ్స్‌కు చెందిన నిపుణుల సహకారంతో డిజైన్లు రూపొందించినట్లు చెప్పారు. గత 200 ఏళ్లలో నమోదైన వర్షపాత పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాతే వరద నియంత్రణ వ్యవస్థకు సంబంధించిన డిజైన్లను సిద్ధం చేసినట్లు వివరించారు. రాజధాని ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని సమర్థంగా నిర్వహించేందుకు కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అనే మూడు కెనాల్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో నీటిని వేగంగా బయటకు తరలించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

అమరావతి వరద నియంత్రణ వ్యవస్థలో భాగంగా 22,500 క్యూసెక్కుల నీటిని బయటకు పంపించే సామర్థ్యంతో పంపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధాని నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత వర్షపు నీరు నిలిచే సమస్య ఉండదని, ఎక్కడా నీటి చుక్క కూడా నిలవకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున ట్రెంచ్‌లలో వర్షపు నీరు కనిపిస్తోందని మంత్రి వివరించారు. పనులు పూర్తయిన తర్వాత నీటి పారుదల వ్యవస్థ పూర్తిస్థాయిలో పనిచేస్తుందని, రాజధాని ప్రాంతంలో వరద ముప్పును సమర్థంగా నియంత్రించగలమని తెలిపారు. అమరావతి రాజధానిపై కొందరు పనిగట్టుకుని రకరకాల తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. వాస్తవ పరిస్థితులను ప్రజలు గమనించాలని సూచించారు. శాస్త్రీయ అధ్యయనాలు, నిపుణుల సూచనల ఆధారంగా రాజధాని వరద నియంత్రణ వ్యవస్థను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు మంత్రి నారాయణ..