Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్

Amaravati

Amaravati

Amaravati Economic Region Master Plan: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. రాజధాని అమరావతి డెవలప్‌మెంట్‌పై ఫోకస్‌ పెడుతూనే.. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాన్ని సమగ్ర ఆర్థిక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కొత్త బ్లూప్రింట్‌ సిద్ధం చేయనుంది. ఇందుకోసం LEA Associates South Asia Private Limited (LASA)కు అమరావతి ఎకనామిక్ రీజియన్ ప్లాన్ తయారీ బాధ్యతలను అప్పగించింది. ఈ సంస్థను Strategic Support Agencyగా ఎంపిక చేస్తూ ప్రభుత్వం రూ.7.07 కోట్ల పరిపాలనా అనుమతులు జారీ చేసింది. అమరావతి నగరానికే పరిమితం కాకుండా దాని చుట్టుపక్కల ప్రాంతాలను విస్తృత ఆర్థిక ప్రాంతంగా అభివృద్ధి చేయడమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. ఇందులో పెట్టుబడులకు అనువైన రంగాలు, పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు, ఉద్యోగాల కల్పన, మౌలిక వసతులు, రవాణా కనెక్టివిటీ వంటి అంశాలపై సమగ్ర వ్యూహాన్ని LASA రూపొందించనుంది.

LEA Associates South Asia భారత్‌లో 1993 నుంచి ఇంజినీరింగ్, ప్లానింగ్, మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ రంగాల్లో సేవలు అందిస్తోంది. కెనడాకు చెందిన LEA Group Holdingsకు చెందిన ఆపరేటింగ్ కంపెనీగా ఉన్న LASA.. రోడ్లు, హైవేలు, బ్రిడ్జిలు, ట్రాన్స్‌పోర్ట్ ప్లానింగ్, అర్బన్-రీజినల్ ప్లానింగ్, వాటర్, రైల్వేలు వంటి విభాగాల్లో కన్సల్టెన్సీ సేవలు అందిస్తోంది. అమరావతిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సీరిస్ రోడ్లకు కూడా LASA సంస్థ డిజైన్లు రూపొందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అమరావతి చుట్టుపక్కల ప్రాంతానికి ఎలాంటి పరిశ్రమలను తీసుకురావచ్చు? ఏ ప్రాంతాల్లో పెట్టుబడులకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? ఎన్ని ఉద్యోగాలు సృష్టించవచ్చు? రోడ్లు, రవాణా, లాజిస్టిక్స్ వ్యవస్థలను ఎలా అనుసంధానం చేయాలి? అనే అంశాలపై సంస్థ రూపొందించే ప్రణాళికపై ఆసక్తి నెలకొంది.

ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా అమరావతిని కేంద్రంగా చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. LASA ఇచ్చే వ్యూహాత్మక సూచనలు అమరావతి ఎకనామిక్ రీజియన్ భవిష్యత్ అభివృద్ధికి ఎంతవరకు దిశానిర్దేశం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.