Akvan Cyclone Alert: మళ్లీ ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుఫాన్‌..! మరో 36 గంటలు అలర్ట్

Akvan Cyclone

Akvan Cyclone

Akvan Cyclone Alert: ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుఫాన్‌ దూసుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తుఫాను ఉత్తర దిశగా కదులుతోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు రానున్న 24 నుంచి 36 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం అక్వాన్ తుఫాను నరసాపురానికి 440 కిలోమీటర్లు, కళింగపట్నానికి 440 కిలోమీటర్లు, చెన్నైకి 580 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 530 కిలోమీటర్లు, పూరీకి 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రేపు మధ్యాహ్నానికి నరసాపురం-పూరీ మధ్య గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయానికి తుఫాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా లేదా తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది.

తుఫాను ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు ఉత్తరాంధ్రలో విస్తారంగా తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటిన అనంతరం వర్షాల తీవ్రత వేగంగా తగ్గే అవకాశముందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్యాంధ్ర, దక్షిణాంధ్ర ప్రాంతాల్లో తుఫాను ప్రభావం గణనీయంగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. తీరప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.

ఇక, మత్స్యకారులు తదుపరి అధికారిక ప్రకటన వచ్చే వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు.. చెరువులు, జలాశయాలు, లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాలపై జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోంది. తుఫాను పరిస్థితిని రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సూచనలను పాటించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది.