NTV Telugu Site icon

Amara Raja: ఆ ప్రచారానికి ఇలా చెక్‌.. ఏపీలో అమరరాజా రూ.250 కోట్ల పెట్టుబడి..

Amara Raja

Amara Raja

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ‘అమరరాజా’ వెళ్లిపోయింది.. ఒక అమరరాజానే కాదు అనేక ప్రతిష్టాత్మక సంస్థలు ఏపీకి బైబై చెప్పేస్తున్నాయి అనే విమర్శలు వచ్చాయి.. తెలంగాణలో అమరరాజా బ్యాటరీస్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమై.. తెలంగాణ సర్కార్‌తో ఎంవోయూ కుదుర్చుకున్న తర్వాత.. ఈ విమర్శలు మరింత పెరిగాయి.. విద్యుత్‌ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల యూనిట్‌ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకున్న ఆ సంస్థ.. ఇందు కోసం రూ. 9,500 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు రెడీ అయిపోయింది.. దీనికి సంబంధించి అమరరాజా సంస్థ, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఇటీవల అవగాహనా ఒప్పందం జరిగింది. ఇదే సమయంలో.. ఏపీ సర్కార్‌పై విమర్శలు పెరిగాయి.. కానీ, వాటికి చెక్‌ పెడుతూ.. ఏపీలోనూ భారీ పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయిపోయింది అమరరాజా కంపెనీ.. ఈ విషయాన్ని ఆ సంస్థ కో-ఫౌండర్‌, తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ స్వయంగా వెల్లడించారు..

Read Also: India-China Border Clash: చైనా బలహీనతలను భారత్ గుర్తించింది.. మరో యుద్ధం తప్పదు.. చైనా నెటిజన్ల స్పందన

చిత్తూరు జిల్లా తేనిపల్లి దగ్గర రూ.250 కోట్లతో కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అమరరాజా గ్రూపు ప్రకటించింది.. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు ఎంపీ గల్లా జయదేవ్.. అమరరాజా.. మంగళం ఇండస్ట్రీస్‌ ఆటో బ్యాటరీ విడిభాగాల తయారీ యూనిట్‌ను ప్రారంభిస్తోంది. ఈ యూనిట్‌ ద్వారా దేశంలోని ప్రముఖ కంపెనీలకు సరఫరా చేసేలా ఆటో విడిభాగాలు, మెటల్‌ ఫాబ్రికేషన్, బ్యాటరీ విడిభాగాలను డిజైన్‌ చేసి సరఫరా చేయబోతున్నారు.. ఇక, స్థానికులకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్న ఆయన.. ఈ యూనిట్‌ ఏర్పాటు ద్వారా మరో వెయ్యి మంది స్థానికులకు ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.. అమరరాజా గ్రూపు 15,000 మందికి ఉపాధి కల్పిస్తుండగా అందులో మంగళం గ్రూపు 3,000 మందికి ఉపాధి దక్కుతోందన్నారు. అలాగే ఇక్కడ తమ వ్యాపార విస్తరణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇంధన పరికరాల ఉత్పత్తిపై దృష్టి పెడతామంటున్నారు.

మొత్తంగా చిత్తూరు ప్రాంతంలో అతిపెద్ద ఉపాధి కల్పించే సంస్థలలో ఒకటిగా ఉంది అమరరాజా.. మరింత ఎక్కువ మందికి మెరుగైన అవకాశాలను అందించాలనే మా నిబద్ధతను బలోపేతం చేస్తూ, మా రాబోయే ప్లాంట్‌తో మేం మరో 1000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని ప్రకటించారు ఎంపీ గల్లా జయదేవ్‌.. 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ప్లాంట్‌ ఉంటుంది. డిజైన్-లీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, మంగళ్ ఇండస్ట్రీస్ ఆటో కాంపోనెంట్స్, మెటల్ ఫ్యాబ్రికేషన్, బ్యాటరీ కాంపోనెంట్స్, టూల్ వర్క్స్, స్టోరేజీ సొల్యూషన్స్ మరియు కస్టమ్ ఫ్యాబ్రికేషన్‌లో డీప్-డొమైన్ నైపుణ్యంతో విస్తృతమైన పరిశ్రమలను అందిస్తోంది. ఇది బహుళ-ఉత్పత్తి సంస్థ, ఇది దేశంలోని కొన్ని అతిపెద్ద బ్రాండ్‌లను తన కస్టమర్‌లుగా జాబితా చేస్తుంది. ప్రస్తుతం, కంపెనీ తన తొమ్మిది ఉత్పాదక సౌకర్యాలలో 3000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉందని కంపెనీ ప్రకటనలో వెల్లడించింది.

అమర రాజా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జయదేవ్ గల్లా మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో పెట్టుబడులతో మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ పెంచడానికి మరియు స్థానిక జనాభాకు ఉపాధి అవకాశాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇది మరింత మందికి వలసేతర ఉద్యోగాలను సృష్టించాలనే మా నిబద్ధతను బలపరుస్తుంది. తేనిపల్లిలో ఈ కొత్త సదుపాయం ద్వారా, మేం ఈ ప్రాంతంలో 1,000 అదనపు ఉద్యోగాలను సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు.. మంగళ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ హర్షవర్ధన గౌరినేని మాట్లాడుతూ, “సుస్థిర ఇంధనంపై మా దృష్టిని కొనసాగిస్తూ, ఈ ప్లాంట్ సోలార్ పవర్‌తో పాటు ఇతర కస్టమ్ ఫ్యాబ్రికేషన్ ఉత్పత్తుల వంటి పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన భాగాలను తయారు చేస్తుంది. ఇది కొత్త విభాగాలు మరియు ఉత్పత్తి లైన్లలోకి మా ప్రవేశానికి కూడా మద్దతు ఇస్తుందన్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అవసరమైన అనుమతులు వచ్చిన వెంటనే కొత్త ప్లాంట్ పనులు ప్రారంభమవుతాయని ఆ ప్రకటనలో తెలిపారు.

Show comments