Heavy Rains: ఒక పక్క వరదలు, మరో వైపు వర్షాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాలు అతలాకుతలం అయ్యాయి. చింతూరు ఏజన్సీలో గత రెండువరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్కన శబరి, మరోవైపు గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనికి తోడు పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో జన జీవనం అస్త వ్యస్థంగా మారింది.
Read Also: OYO : కస్టమర్‌తో ఆ పని చేసిన హోటల్ యజమాని.. రూ.లక్ష చెల్లించాల్సిందే అన్న కోర్టు
అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాలను గత కొన్ని రోజులుగా వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. వరుస తుఫాన్ల ప్రభావంతో కుండపోతగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో విలీన మండలాల్లోని వాగులు, వంకలు పొంగి పలు చోట్ల రహదారులపై ప్రవహిస్తున్నాయి. ఈ ప్రభావంతో కూనవరం మండలం కొండరాజు పేట వద్ద కాజువే పైకి వరద నీరు చేరుకుని సుమారు 10 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు వీఆర్ పురం మండలంలో కొండవాగు పొంగడంతో అన్నవరం గ్రామం వద్ద వంతెనపై నుండి భారీగా నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల వీఆర్ పురం.. చింతూరు మండలాల మధ్య సుమారు 30 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా భారీ వర్షాల నేపథ్యంలో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డుపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఆగకుండా కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున అటుగా వాహనాలను తిరగరాదని పోలీసులు ముందస్తుగా హెచ్చరించారు.. కాగా, డొంకరాయి జలాశయం నిండుకోవడంతో నుంచి తాజాగా లక్ష పది వేల క్యూసెక్కుల నీటిని జెన్ కో అధికారులు దిగువకు విడుదల చేశారు. ఈ ప్రభావంతో శబరి నదికి భారీగా వరద నీరు చేరుతుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఇప్పటికే గత నెల రోజులుగా వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న విలీన మండలాల ప్రజలను మరోసారి తుఫాన్ ప్రభావం తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తోంది..